Darshan|అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టైన కన్నడ స్టార్ హీరో దర్శన్(Darshan)కు కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్(Interim Bail) మంజూరు చేసింది. ఆయన ఆరోగ్యం దృష్ట్యా వైద్య చికిత్సల కోసం ఆరు వారాల పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల బెయిల్ కోసం కింది కోర్టులో దర్శన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. అనంతరం దర్శన్ తరపు న్యాయవాది సీవీ నగేష్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దర్శన్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారని.. త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవాలని వాదించారు. చికిత్స ఆలస్యమైతే పక్షవాతం వస్తుందేమోనని అనుమానం ఉందంటూ డాక్టర్ ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పించారు.
అయితే దర్శన్ ఆరోగ్య సమస్యలపై నివేదిక ఇచ్చేందుకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్ వాదించారు. దర్శన్ న్యాయవాది సమర్పించిన డాక్టర్ రిపోర్టులో సర్జరీ, కోలుకోవడానికి పట్టే సమయం సరిగ్గా లేదని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ విశ్వేశ్వర్ భట్ ఆరు వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.