Ravi Mohan Visits Tirumala: కోలీవుడ్ హీరో జయం రవి.. ఇప్పుడు తన పేరుని రవి మోహన్‌గా మార్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలను అందుకుని తనదైన గుర్తింపు దక్కించుకున్న ఈ స్టార్ గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. కొన్నాళ్లు ముందు తన సతీమణి ఆర్తి నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రవి మోహన్ తన ప్రియురాలు కెన్నీసా ఫ్రాన్సిస్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో తిరుమలకు రావటం, సుప్రభాత సేవలో పాల్గొనటంతో వారికి సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆర్తి నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన రవి మోహన్ కేసు ఇంకా కోర్టులోనే ఉంది. ఆర్తి నుంచి తనకు విడాకులు కావాల్సిందేనంటూ ఈ హీరో కోరారు. దీంతో ఆమె ఏకంగా రవి మోహన్ నుంచి నెలకు రూ.40 లక్షలు భరణాన్నిఇప్పించాలని కోరింది. ఈ విడాకుల వివాదం నడుస్తున్న నేపథ్యంలో గాయని కెన్నీషా కారణంగానే రవి మోహన్ తనకు విడాకులు ఇస్తున్నాడంటూ ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే జయం రవి, కెన్నీషా గతంలో అనేక సందర్భాల్లో జంటగా కనిపించారు. సినిమా ఈవెంట్లు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, దేవాలయాల సందర్శనలకు వీరిద్దరూ కలిసి కనిపించటంతో రవి మోహన్, కెన్నీసా పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. అలాగే నటుడు గణేష్ కుమార్ కుమార్తె వివాహంలో వారు చేతులు పట్టుకుని కనిపించడం ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది.
వ్యక్తిగత జీవితంతో పాటు రవి మోహన్ వృత్తిపరంగా కూడా కొత్త అడుగులు వేస్తున్నారు. ఆయన త్వరలో ‘రవి మోహన్ స్టూడియోస్’ పేరుతో చెన్నైలో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నారు. ఈ నిర్మాణ సంస్థ ప్రారంభోత్సవానికి ముందుగానే ఆయన శ్రీవారిని దర్శించుకోవడం గమనార్హం. ప్రస్తుతం రవి మోహన్ గణేష్ కె బాబు దర్శకత్వంలో ‘కరాటే బాబు’, సుధా కొంగర దర్శకత్వంలో ‘పరాశక్తి’ వంటి రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. రవి మోహన్, కెన్నీషాల తిరుమల దర్శనం మరోసారి సినీ వర్గాల్లో, అభిమానుల్లో చర్చకు దారితీసింది.
తను ఆర్థికంగా నష్టపోవటానికి ఆర్తి, ఆమె తల్లే కారణమని జయం రవి ఆరోపించారు. జయం రవి వార్తలను ఆర్తి ఖండించింది. తనను సంప్రదించకుండానే విడాకుల గురించి ప్రకటించారని ఆర్తి తెలియజేసింది. కోర్టు ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చటానికి కౌన్సెలింగ్ ఇవ్వాలని చూసినా రవి మోహన్ అందుకు ఒప్పుకోలేదు.


