Chiranjeevi – Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా అనీల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ ‘మెగా 157’ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఎంతో ప్రెస్టీజియస్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించి షూటింగ్‌లో తెరకెక్కిస్తోన్న ఒక సన్నివేశానికి సంబంధించిన వీడియో లీక్ రూపంలో బయటకు వచ్చింది. సదరు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన చిత్ర నిర్మాణ సంస్థ తీవ్రంగా స్పందించింది.
Also Read- Ram Charan: త్రివిక్రమ్…ప్రశాంత్‌నీల్ కాదు…రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనే!
వైరల్ అవుతోన్న‘మెగా 157’ అనధికార కంటెంట్‌పై నిర్మాణ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.‘ మెగా 157 మూవీకి సంబంధించిన కొన్ని అనధికార వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. అవి మా దృష్టికి వచ్చాయి. మా అనుమతి లేకుండా సెట్స్ నుంచి కంటెంట్ రికార్డు చేయొద్దని కోరుతున్నాం. అలాచేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేసింది. ఇలాంటి పనుల వల్ల షూటింగ్‌కు అంతరాయం కలగడమే కాకుండా, సినిమా కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న టీమ్ కష్టాన్ని నీరుగార్చినట్లు అవుతుందని నిర్మాతలు పేర్కొన్నారు. ఇదే సమయంలో ‘ఎంతో ప్రేమతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. అధికారిక సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలని అభిమానులను కోరుతున్నాం’ అంటూ ఒక కీలక విజ్ఞప్తిని కూడా చేశారు.

వైరల్ అవుతోన్న సమాచారం మేరకు మెగా 157లో చిరంజీవి తన అసలు పేరు అయిన శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు ‘మన శివ శంకర్ వరప్రసాద్ గారు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. చిరంజీవితో నయనతార జోడీ కడుతుండగా, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh) అతిథి పాత్రలో మెరవనున్నారు. ఆయన పాత్ర చాలా హాస్యభరితంగా ఉంటుందని ఇటీవల వెంకటేశ్ స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరో వైపు చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ విశ్వంభర (Vishwambhara) తుది దశకు చేరుకుంది. ఈ సినిమాను ఈ దసరా సందర్భంగా అక్టోబర్‌లో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. సోషియో ఫాంటసీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీలో త్రిష (Trisha) హీరోయిన్‌గా నటిస్తోంది.


