Mohan Babu: పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై నటుడు మోహన్ బాబు స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా క్లారిటీ ఇస్తూ పోస్ట్ చేశారు. తాను పరారీలో ఉన్నట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం తన ఇంట్లోనే వైద్యుల సంరక్షణలో ఉన్నానని పేర్కొన్నారు. అలాగే హైకోర్టులో తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికాలేదని స్పష్టం చేశారు. వాస్తవాలను బయటపెట్టాలని మీడియాను కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు.
కాగా జర్నలిస్టుపై దాడి ఘటనలో తనపై నమోదైన హత్యాయత్నం కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్ పిటిషన్ న్యాయస్థానం కొట్టివేసిందని.. ఈ నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు మోహన్ బాబు ఇంటికి వెళ్లారనే వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారంటూ కథనాలు వెల్లువడ్డాయి. తాజాగా ఈ వార్తలను ఆయన ఖండించారు.