OG MOVIE: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ (They Call Him OG)కి సంబంధించి తెలంగాణలో టికెట్ ధరల పెంపు విషయంలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సినిమా ప్రీమియర్ షోలతో పాటు విడుదలైన పది రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమో (జీవో)ను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ఈ అంశంపై విచారణ జరిపి, టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేశారు. సెప్టెంబరు 24న రాత్రి 9 గంటలకు ప్రదర్శించే ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 800 (జీఎస్టీతో కలిపి)గా, సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 150 వరకు పెంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఈ జీవోను సవాల్ చేస్తూ న్యాయవాది బర్ల మల్లేష్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం పాత జీవో (జీవో 120, 2021)ను ఉల్లంఘిస్తూ, సినిమా నిర్మాణ సంస్థకు లబ్ది చేకూర్చేలా ఈ మెమోను జారీ చేసిందని పిటిషనర్ వాదించారు. హైకోర్టు ఈ వాదనలను పరిగణనలోకి తీసుకుని, టికెట్ ధరల పెంపుపై తాత్కాలిక నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా పరిణామం ఏమిటంటే, తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి థియేటర్ యాజమాన్యాలకు ‘ఓజీ’ టికెట్ ధరలను వెంటనే తగ్గించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పెంచిన ధరలను రద్దు చేసి, ప్రభుత్వం 2021లో (G.O. Ms. No. 120) నిర్ణయించిన ప్రామాణిక ధరలకే టికెట్లను విక్రయించాలని పోలీస్ శాఖ ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించని థియేటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు కఠినంగా హెచ్చరించారు.
అంతేకాకుండా, సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ (పెద్దలకు మాత్రమే) సర్టిఫికేట్ జారీ చేసినందున, 18 ఏళ్లలోపు పిల్లలను సినిమా ప్రదర్శనలకు అనుమతించకుండా చూడాలని కూడా పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను అక్టోబరు 9కి వాయిదా వేసింది. ఈ తీర్పుల కారణంగా, పెరిగిన ధరలకు టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు గందరగోళానికి గురయ్యారు. నిర్మాతలకు, పంపిణీదారులకు ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా మారింది.


