Pooja Hegde: నిన్న మొన్నటి వరకు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది మన బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఆమె డేట్స్ కోసం మన మేకర్స్ క్యూ కట్టారు. ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వటానికి కూడా రెడీ అయ్యారు. అయితే రాధే శ్యామ్ నుంచి లెక్కలు మారాయి. ఆ సినిమా నుంచి ఆమెకు వరుస ఫ్లాప్స్ పలకరించటంతో టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయి. ఈ ఏడాది సూర్యతో ఆమె నటించిన రెట్రో మూవీపై ఆమె పెట్టుకున్న భారీ ఆశలు కూడా ఆవిరయ్యాయి. దీంతో ఇప్పుడీ బ్యూటీ నార్త్ సినిమాలతోనే సరిపెట్టుకుంటోంది. ఈ తరుణంలో అమ్మడుకి సూపర్‌స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) కాంబోలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘కూలీ’లో ఐటెమ్ సాంగ్ చేసే ఛాన్స్ వచ్చింది. అడిగినంత పారితోషకం ఇచ్చే నిర్మాతలు ఉండటంతో అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఇప్పటికే కూలీ మూవీ భారీ తారాగణంతో నిండిపోయింది. రజినీకాంత్, నాగార్జున అక్కినేని (Nagarjuna Akkineni), ఆమిర్ ఖాన్ (Aamir Khan), ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతీ హాసన్ వంటి వారు నటిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ తనదైన యూనివర్స్‌లోకి ఈ చిత్రంతో రజినీకాంత్‌ను ఎంట్రీ చేయిస్తున్నారు. ఆగస్ట్ 14న ఈ మూవీ వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీలో పూజా హెగ్డే ఐటెమ్ సాంగ్ చేసింది. ఇప్పుడిప్పుడే కూలీ ప్రమోషన్స్‌లో వేగం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం కూలీ మూవీ నుంచి మోనిక .. అంటూ పూజా హెగ్డే ఐటెం సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో పూజా హెగ్డేతో పాటు మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ కనిపిస్తున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ తనదైన స్టైల్లో మరోసారి బ్యూటీఫుల్ ట్యూన్‌ను కంపోజ్ చేశారు. కూలీ మూవీ కోసం అభిమానులే కాదు.. ట్రేడ్ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ మూవీతో రజినీకాంత్ వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరుతాడని అందరూ భావిస్తున్నారు. తెలుగు విషయానికి వస్తే ఏషియన్ సురేష్ సంస్థ ఈ మూవీ తెలుగు రీమేక్ హక్కులను ఏకంగా రూ.52 కోట్లకు సొంతం చేసుకుంది. అంటే తెలుగులో ఈ మూవీ వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధిస్తే ఇక్కడ తెలుగు హక్కులను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అవుతారు. మరి కూలీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.


