హీరో రామ్‌చరణ్ (Ram Charan) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawankalyan)కు ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రిలో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్‌తో దిగిన ఫొటోలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘‘ప్రియమైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు.. మీ తనయుడు, నటుడు, భారత పౌరుడిగా నేను మిమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నాను. నా వెన్నంటే ఉన్నందుకు, నాకెప్పుడూ సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు.
‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం రాజమండ్రిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘రామ్‌చరణ్ మా బంగారం. ఒక తల్లికి పుట్టకపోయినా నా తమ్ముడు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు. భవిష్యత్తులో అద్భుత విజయాలు కలగాలని ఒక బాబాయిగా కాదు, అన్నగా ఆశీర్వదిస్తున్నా’’ అని పవన్‌కల్యాణ్ అన్నారు. ఇక చరణ్ కూడా దేశంలోని రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ రియల్ గేమ్ ఛేంజర్ అని కొనియాడారు. దీంతో బాబాయ్-అబ్బాయ్ అనుబంధం చూసి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.