Satyam Sundaram| తమిళ చిత్రాలు వాస్తవికతకు దగ్గరగా తెరకెక్కుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కథకు తగ్గట్లు నటులు కూడా ఆయా పాత్రల్లో ఒదిగిపోతారు. అందుకే తమిళ చిత్రాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ క్రమంలోనే దర్శకుడు ప్రేమ్‌కుమార్ స్టార్ హీరో కార్తీ( Karthi), సీనియర్ నటుడు అరవింద్ స్వామి(Arvind Swami) కలయికలో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) మూవీ తెరకెక్కించారు. ఇటీవల సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు హృదయాలను బరువెక్కించింది. బావ-బామ్మర్దుల ప్రేమ నేపథ్యంలో సాగిన ఈ మూవీ అభిమానులను కట్టిపడేసింది. ఇందులోని పాత్రల భావోద్వేగాలు థియేటర్ నుంచి బయటకు వచ్చినా కూడా ప్రేక్షకులను వెంటాడాయి.
ఇప్పుడీ చిత్రం బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 27 నుంచి డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో వెండితెరపై ఈ మూవీని మిస్సైన ప్రేక్షకులు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీదివ్య కూడా కీలక పాత్ర పోషించింది.
సినిమా కథేంటంటే..?
సత్యమూర్తి అలియాస్ సత్యం(అరవింద్ స్వామి) స్వస్థలం గుంటూరు జిల్లాలోని ఉద్దండరాయుని పాలెం. అతడికి తన సొంత గ్రామం అన్నా.. ఊర్లోని తన తాతల కాలం నాటి ఇళ్లన్నా చాలా ఇష్టం. అయితే కొందరు బంధువులు మోసం చేయడంతో సత్యం చిన్న వయసులోనే వాళ్ల కుటుంబం ఆ ఇల్లు కోల్పోతుంది. దీంతో ఆ కుటుంబం ఆ ఊరుని వదిలేసి వైజాగ్ వచ్చి స్థిరపడుతోంది. ఇలా జరిగి 30 ఏళ్లు దాటినా సత్యంను ఆ ఊరు, తన ఇంటి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తన బాబాయ్ కూతురు పెళ్లి కోసం సొంత గ్రామం వెళ్లాల్సి వస్తుంది. ఆ పెళ్లిలోనే అతడిని బావ అని ఆప్యాయంగా పలకరిస్తూ కార్తీ తారసపడతాడు. అయితే అతడి మితిమీరిన చనువుతో తనని జిడ్డులా భావిస్తాడు సత్యం. కానీ పరిచయం పెరిగే కొద్దీ కార్తీ చూపే ఆప్యాయత, ప్రేమాభిమానాలు సత్యం మనసును కట్టిపడేస్తాయి. మరి తర్వాత వీరిద్దరి మధ్య ఏం జరిగిందన్నదే మిగతా కథ.