Junior movie hero: గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జూనియర్’. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్రలో నటించారు. జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీలీల మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీలీల మాట్లాడుతూ, ‘జూనియర్’ ఒక చిన్న కథను పెద్ద కాన్వాస్‌లో చెప్పే ప్రయత్నమని తెలిపారు. జెనీలియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, “హాసినిగా మా గుండెల్లో స్థానం సంపాదించుకున్న జెనీలియా, ఈ సినిమాతో తిరిగి వస్తున్నారు. ‘జూనియర్’ను తన కంబ్యాక్ సినిమాగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. జెనీలియా రాకతో ఈ సినిమాకు ఒక బ్రాండ్ వాల్యూ వచ్చింది. ఆమె నన్ను చాలా బాగా చూసుకున్నారు. మొదటి నుంచి ప్రతి విషయంలో తోడుగా ఉంటూ ప్రేమగా ఉన్నారు. మేకప్ విషయంలో కూడా నాకు సహాయం చేశారు” అని శ్రీలీల ఎంతో ఆప్యాయంగా చెప్పారు.
దేవి శ్రీ ప్రసాద్‌పై ప్రశంసలు
తనకు “వైరల్ వయ్యారి” ట్యాగ్ వచ్చిందంటే దానికి కారణం దేవి శ్రీ ప్రసాద్ అని శ్రీలీల పేర్కొన్నారు. “సాధారణంగా పాట కంపోజ్ చేస్తే తమ పని అయిపోతుంది అనుకుంటారు. కానీ దేవి శ్రీ ప్రసాద్ పాట ఇవ్వడమే కాకుండా, ఇలాంటి స్టెప్పులు వేయండి, ఇలా చేస్తే బాగుంటుంది అని సలహాలిస్తూ సెట్స్‌కి వచ్చి అందరికీ ఎనర్జీ ఇస్తారు. అందుకే ఆయన రాక్‌స్టార్ అయ్యారు. వైరల్ దేవి శ్రీ అయితే, నేను వయ్యారిని” అని సరదాగా అన్నారు. డీఓపీ సెంథిల్ కుమార్ గురించి మాట్లాడేటప్పుడు శ్రీలీల ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. “లైఫ్‌లో ఎవరికైనా ఏ బాధ ఉన్నా ఆయనతో రెండు నిమిషాలు మాట్లాడితే చాలు, మొత్తం నార్మల్ అయిపోతుంది. ఆయన చుట్టూ ఒక దైవికమైన ఆరా ఉంది. షూటింగ్ చివరి రోజు మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నందుకు చాలా బాధగా అనిపించింది. ఆయన్ని చాలా మిస్ అవుతున్నాను. ఎన్ని కష్టాలున్నా సెంథిల్ సార్ ఈ సినిమా కోసం ఎంత బలంగా పని చేశారో నాకు తెలుసు. ఆ దేవుడు ఎప్పుడూ ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాను” అని కన్నీటి పర్యంతమయ్యారు.
‘జూనియర్’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండగా, ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైప్ ను మరింత పెంచింది. శ్రీలీల ప్రసంగాలు, సినిమా యూనిట్ మధ్య ఉన్న బంధాన్ని, సినిమా పట్ల వారి అంకితభావాన్ని స్పష్టం చేశాయి.


