Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభYugandhar Tammareddy: నిజామాబాద్ టు హాలీవుడ్.. ఆస్కార్ కమిటీలో తెలుగోడు!

Yugandhar Tammareddy: నిజామాబాద్ టు హాలీవుడ్.. ఆస్కార్ కమిటీలో తెలుగోడు!

Yugandhar Tammareddy Oscar Academy: ఆసక్తి ఉంటే ఆకాశమే హద్దు అంటారు. కానీ, ఆ ఆసక్తినే ఆయుధంగా చేసుకుని, ఏకంగా ఆస్కార్ గడపనే తొక్కాడు నిజామాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన యువకుడు. ప్రపంచ సినిమాకే అత్యున్నత గౌరవంగా భావించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో (ఆస్కార్ కమిటీ) సభ్యుడిగా చేరి తెలుగువారి సత్తాను సగర్వంగా చాటాడు. అతనే విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) సూపర్వైజర్ తమ్మారెడ్డి యుగంధర్. అసలు ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈ కుర్రాడు, హాలీవుడ్ ప్రముఖులు సైతం అబ్బురపడే స్థాయికి ఎలా ఎదిగాడు? ఆయన ప్రస్థానంలోని మలుపులేంటి..? ఆ విజయ రహస్యం ఏమిటి..?

- Advertisement -

మధ్యతరగతి నుంచి మహోన్నత స్థాయికి..
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం అనే చిన్న గ్రామంలో తిలక్, రాణి దంపతులకు జన్మించారు యుగంధర్. తండ్రి రుద్రూర్‌లోని వరి, చెరకు పరిశోధన కేంద్రంలో చిరుద్యోగి. ఎనిమిదో తరగతి వరకు వొడ్డెపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలోనే చదువుకున్నారు. తండ్రి బదిలీతో కరీంనగర్‌లో పదో తరగతి, హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.

READ MORE: https://teluguprabha.net/cinema-news/naresh-agastya-love-drama-movie-marokkasari-first-look-unveiled/

ఆసక్తే దారి చూపింది.. ఇంటర్మీడియట్‌లో కంప్యూటర్ సైన్స్ ఒకేషనల్ కోర్సు తీసుకున్న యుగంధర్‌కు ఆ రంగంపై మక్కువ పెరిగింది. ఆ తర్వాత బీఎస్సీ సైకాలజీలో చేరినా, మనసంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ పైనే లగ్నమైంది. దీంతో చదువును మధ్యలోనే ఆపేశారు. కొడుకు ఆసక్తిని గమనించిన తండ్రి, “నీకు ఇష్టమైన రంగంలోనే వెళ్లు” అని ప్రోత్సహించడం ఆయన జీవితంలో కీలక మలుపు. ఆ ప్రోత్సాహంతోనే 1996లో హైదరాబాద్‌లోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో మల్టీమీడియాలో శిక్షణకు చేరారు.

అంచెలంచెలుగా అద్భుత ప్రస్థానం : శిక్షణ సమయంలో సిలికాన్ గ్రాఫిక్స్ టెక్నాలజీ గురించి తెలుసుకున్న ఆయన, అప్పట్లో అది కేవలం పద్మాలయా స్టూడియోలో మాత్రమే అందుబాటులో ఉండటంతో, తండ్రి, బంధువుల సహకారంతో అందులో చేరి రెండేళ్ల పాటు విజువల్ ఎఫెక్ట్స్‌లో నైపుణ్యం సాధించారు.

తొలి అడుగులు: సీఎస్ గ్రాఫిక్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరి, మహేష్ బాబు తొలి చిత్రం ‘రాజకుమారుడు’కు కొన్ని షాట్స్‌కి వీఎఫ్ఎక్స్ అందించి సినీ రంగ ప్రవేశం చేశారు. ‘దేవీపుత్రుడు’ చిత్రానికి ప్రధాన వీఎఫ్ఎక్స్ బృందంలో పనిచేశారు.

సూపర్వైజర్‌గా గుర్తింపు: దర్శకుడు తేజ ప్రోత్సాహంతో ‘నువ్వు నేను’ చిత్రానికి వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ‘జయం’ చిత్రంతో ఆయన ప్రతిభకు మరింత గుర్తింపు లభించింది.

READ MORE: https://teluguprabha.net/cinema-news/shiva-to-re-release-in-theaters-with-4k-visuals-and-dolby-atmos/

సొంత సంస్థల ఏర్పాటు: ముంబయిలో కొన్నాళ్లు పనిచేసినా, సంతృప్తి లభించకపోవడంతో 2005లో స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో ‘పిక్సెలాయిడ్’ సంస్థను, 2015లో ‘వీఎఫ్ఎక్స్ నేషన్’ పేరుతో సొంత కంపెనీని స్థాపించి ఎందరికో ఉపాధి కల్పించారు.

ఆస్కార్ అకాడమీలో అడుగు: ఇప్పటివరకు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో 120కి పైగా చిత్రాలకు తన వీఎఫ్ఎక్స్ నైపుణ్యంతో ప్రాణం పోశారు. ఆయన పనితనాన్ని గమనించిన ఆస్కార్ అకాడమీ సభ్యులు, ఆరు నెలల పాటు పర్యవేక్షించి, ఉత్తమ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్‌గా గుర్తించి ప్రతిష్టాత్మక సభ్యత్వాన్ని అందించారు. “ఆస్కార్ అకాడమీలో సభ్యత్వం దక్కడం గొప్ప గౌరవం. సినిమాలకు ఓటు వేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది,” అని యుగంధర్ తన సంతోషాన్ని పంచుకున్నారు. త్వరలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు, యువత లక్ష్యాన్ని ఎంచుకుని కష్టాలకు భయపడకుండా ముందుకెళితే విజయం తథ్యమని ఆయన స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad