New Tollywood movies of pooja Hegde: తెలుగు ప్రేక్షకులకు ‘బుట్టబొమ్మ’గా సుపరిచితమైన నటి పూజా హెగ్డే కొంతకాలంగా టాలీవుడ్‌కి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. 2020లో విడుదలైన ‘అల వైకుంఠపురములో’ సినిమా తరువాత ఆమెకు తెలుగులో చెప్పుకోదగ్గ విజయం దక్కలేదు. ఆ సినిమాతో అగ్ర కథానాయికగా గుర్తింపు పొందిన పూజా ఆ తర్వాత నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ చిత్రాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి.
ఈ విరామ సమయంలో పూజా తన దృష్టిని తమిళం, హిందీ చిత్ర పరిశ్రమల వైపు మళ్ళించింది. తమిళంలో విజయ్‌తో కలిసి ‘బీస్ట్’ చేసినప్పటికీ, ఆ తర్వాత ‘కూలీ’, ‘జన నాయకన్’, ‘కాంచన 4’, ‘రెట్రో’ వంటి ప్రాజెక్టులలో అవకాశాలు దక్కించుకుంది. హిందీలో సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో నటించినా అనుకున్న విజయం దక్కలేదు.
అయితే, ఆమె గ్లామర్, కమర్షియల్ డిమాండ్ మాత్రం తగ్గలేదు. తరచుగా స్టార్ హీరోల ప్రాజెక్టులలో ఆమె పేరు చర్చల్లో వినిపిస్తూనే ఉంది.
దుల్కర్ సల్మాన్‌తో పూజా హెగ్డే?
తాజా సమాచారం ప్రకారం, పూజా హెగ్డే తెలుగులో ఒక మంచి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఆమె ఒక ప్రేమకథా చిత్రంలో నటించనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొత్త దర్శకుడు రవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం.
‘దసరా’, ‘ప్యారడైస్’ వంటి చిత్రాలను నిర్మించిన సుధాకర్ చెరుకూరి తన SLV సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నప్పటికీ, దుల్కర్ సల్మాన్ డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైందని తెలుస్తోంది.
‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ విజయాల తర్వాత తెలుగు మార్కెట్‌లో దుల్కర్ సల్మాన్ బలమైన పట్టు సాధించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘కాంతా’, ‘ఆకాశంలో ఒక తారా’ వంటి సినిమాలు మరింత అంచనాలను పెంచాయి. ఈ సమయంలో పూజా హెగ్డే, దుల్కర్ సల్మాన్ కలయిక ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని, పూజా కెరీర్‌కు ఇది తిరిగి పుంజుకోవడానికి మంచి అవకాశం అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.


