Tollywood: కార్మికుల స్ట్రైక్ కారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి భారీగా నష్టం వాటిల్లింది. నెల రోజుల వరకు సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. రిలీజ్ డేట్స్ తారుమారు అయ్యాయి. చివరకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు కార్మికుల స్ట్రైక్ వివాదం వెళ్లింది. కార్మికుల వేతనాలు పెంచడానికి మొదట బెట్టు చేసిన ప్రొడ్యూసర్లు చివరకు మెట్టు దిగారు. పదిహేను శాతం వరకు వేతనాలు పెంచారు. ఈ వివాదం సమసిపోక ముందే టాలీవుడ్‌కు మరో కొత్త సమస్య వచ్చి పడింది.
పర్సంటేజ్ సిస్టమ్…
థియేటర్ల బంద్‌కు ఎగ్జిబిటర్లు పిలుపునిచ్చేందుకు రెడీ అవుతున్నారట. పర్సంటేజ్ సిస్టమ్‌ను అమలు చేయకపోతే డిసెంబర్ 2 నుంచి థియేటర్లను బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్న ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రకటన ద్వారా థియేటర్ల బంద్‌పై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లు హింట్ ఇచ్చారని అంటున్నారు.
ప్రస్తుతం థియేటర్లలో ఎక్కువగా రెంటల్ సిస్టమ్ అమలు అవుతోంది. ఈ రెంటల్ విధానంలో ఎగ్జిబిటర్లకు నిర్మాతలు ముందుగానే ఎన్ని రోజులు సినిమాను ప్రదర్శించాలని అనుకుంటే అన్ని రోజుల రెంట్ చెల్లిస్తుంటారు. ఈ రెంటల్ విధానం వల్ల ఎగ్జిబిటర్లకు లాభాల్లో వాటాలు రావడం లాంటివేవి ఉండవు.
Also Read – Samantha: సమంత ‘మా ఇంటి బంగారం’ అప్‌డేట్ ఇచ్చేసింది..
లాభాల్లో వాటా…
పర్సంటేజ్ సిస్టమ్ అయితే ఓ సినిమాకు వచ్చిన కలెక్షన్స్‌లో నుంచి ఎగ్జిబిటర్లకు వాటా దక్కుతుంది. ఈ విధానంలో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లకు డబ్బులు చెల్లిస్తుంటారు. డిస్ట్రిబ్యూటర్ల షేర్, ప్రొడ్యూసర్ల షేర్ పోగా మిగిలింది ఎగ్జిబిటర్లకు దక్కుతుంది. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రతి సినిమాకు ఎంతో కొంత షేర్ దక్కుతుంది. పర్సంటేజ్ సిస్టమ్ నిర్మాతలకు మాత్రం భారం అవుతుంది. అందుకే ఈ విధానాన్ని చాలా కాలంగా ప్రొడ్యూసర్లు వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
త్వరలో చర్చలు…
అందుకే ఈ పర్సంటేజ్ సిస్టమ్‌ను అమలులోకి తీసుకురావాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ఈ పర్సంటేజ్ సిస్టమ్ అమలుచేయకపోతే థియేటర్లను బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం. పర్సంటేజ్ సిస్టమ్ గురించి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో త్వరలోనే ఎగ్జిబిటర్ల అసోసియేషన్స్ చర్చలు జరపనున్నట్లు సమాచారం.
అఖండ 2 రిలీజ్…
ఒకవేళ థియేటర్ల బంద్ అమలు అయితే డిసెంబర్‌లో రిలీజయ్యే పెద్ద సినిమాల పరిస్థితి ఏమిటన్నది టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. డిసెంబర్‌లో బాలకృష్ణ అఖండ 2, డెకాయిట్‌తో పాలు పలు భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. డిసెంబర్‌కు మరో రెండు నెలల వరకు టైమ్ ఉండటంతో అప్పటివరకు ఈ పర్సంటేజ్ సిస్టమ్ సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కొందరు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు.
Also Read – Musi River: మూసీ నదికి పోటెత్తిన వరద.. జంట జలాశయాల నుంచి దిగువకు నీటి విడుదల!


