Trisha latest news: నటి త్రిష మరోసారి తన వ్యక్తిగత జీవితంపై వినిపిస్తున్న ఊహాగానాలతో వార్తల్లో నిలిచారు. కోలీవుడ్‌లోని ఓ ప్రముఖ హీరోతో ఆమె ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల త్రిష చేసిన సోషల్ మీడియా పోస్ట్, దానికి ఆమె తల్లి ఇచ్చిన స్పందన, ఇతర పరిణామాలు ఈ చర్చకు దారి తీశాయి.
సోషల్ మీడియాలో చర్చకు దారితీసిన పోస్ట్‌లు
ఇటీవల ఓ ప్రముఖ నటుడి పుట్టిన రోజు సందర్భంగా, త్రిష ఆయనతో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ ఫోటోనే త్రిష తల్లి కూడా షేర్ చేస్తూ, దానికి హార్ట్ ఎమోజీని జతచేశారు. ఈ రెండు పోస్ట్‌లు నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తించాయి. వీరిద్దరి మధ్య ఏదో ప్రత్యేక బంధం ఉందంటూ నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. కొందరు అభిమానులు దీన్ని కేవలం స్నేహంగా భావిస్తుండగా, మరికొందరు మాత్రం ప్రేమ వ్యవహారంగా చూస్తున్నారు.
ప్రేమ గురించి త్రిష ఆసక్తికర పోస్ట్:
ఈ పుకార్లపై త్రిష నేరుగా స్పందించనప్పటికీ, తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రేమకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. “ప్రేమలో పూర్తిగా మునిగిపోతే అది వారిని తికమక పెడుతుంది” అనే అర్థం వచ్చేలా ఉన్న ఆ పోస్ట్, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి మరింత ఊపునిచ్చింది. అయితే, ఇది ఈ వదంతులను ఉద్దేశించి పెట్టిందేనా లేక యాదృచ్ఛికమా అనేది స్పష్టంగా తెలియదు.
గతంలో పెళ్లి వదంతులు:
త్రిష పెళ్లి గురించి గతంలో కూడా చాలాసార్లు వదంతులు వ్యాపించాయి. అయితే, ఆమె ప్రతీసారి వాటిని సున్నితంగా ఖండించారు. తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఒకవేళ వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంటే ఆ విషయాన్ని కచ్చితంగా అధికారికంగా ప్రకటిస్తానని గతంలో ఒక సందర్భంలో త్రిష స్పష్టం చేశారు.
త్రిష రాబోయే సినిమాలు:
సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటినా త్రిష.. ఇప్పటికీ కథానాయికగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే ఆమె ‘ఐడెంటిటీ’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ‘థగ్‌లైఫ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’, అలాగే తమిళ నటుడు సూర్య సరసన ‘కరుప్పు’ చిత్రాల్లో త్రిష నటిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న చెన్నై చంద్రం, ఈ తాజా రూమర్లపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.