రీసెంట్‌గా జరిగిన ‘మిత్రమండలి’ మూవీ ఈవెంట్‌లో ఎవరో డబ్బులిచ్చి తమ సినిమాపై నెగటివ్ ప్రచారం చేయిస్తున్నారనీ, వాళ్లు తన వెంట్రుక కూడా పీకలేరనీ ఆ చిత్ర నిర్మాత బన్నీ వాస్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఎవర్ని ఉద్దేశించి ఆయన అన్నారో తెలుసుకోవాలనే తాపత్రయం మీడియాలో, సోషల్ మీడియాలో బాగా కనిపించింది. బన్నీ వాస్ నిర్దిష్టంగా ఎవరి పేరూ చెప్పకపోవడంతో, ఆయన కూడా ప్రమోషనల్ స్ట్రేటజీలో భాగంగానే ఆ విమర్శలు చేశారనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
ఈ దీపావళికి నాలుగు తెలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్నాయి. అన్నిటికంటే ముందుగా అక్టోబర్ 16న ప్రియదర్శి ‘మిత్రమండలి’ సినిమా విడుదలవుంటే, 17న ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’, సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ సినిమాలు, 18న కిరణ్ అబ్బవరం ‘కె-ర్యాంప్’ విడుదలవుతున్నాయి. వీటిలో ఏయే సినిమాలు ఆడియెన్స్ మనసుల్ని గెలుచుకుంటాయనే చర్చ నడుస్తోంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/meesala-pilla-song-out-from-mana-shankara-varaprasad-garu/
“బ్రదర్, మనం ఇక్కడున్నది ఎదగడానికి. కష్టపడుదాం, కలిసి ఎదుగుదాం. ఒక సినిమా మీద నెగటివ్ ప్రాపగాండా చేస్తే ఎదిగిపోతాం అనుకుంటే మాత్రం.. పైన దేవుడున్నాడు, చూసే ప్రేక్షకులున్నారు” అని ఎమోషనల్ అవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా బన్నీ వాసు ఇలా ఎమోషనల్ అవడం ఈమధ్య కాలంలో చూడలేదు. అంటే ‘మిత్రమండలి’ మీద ఎవరో చేసిన నెగటివ్ ప్రాపగాండా ఆయనను బాగా హర్ట్ చేసినట్లు అర్థమవుతోంది.
“పోటీలో యుద్ధం చెయ్యడంలో తప్పులేదు. కానీ ఆ యుద్ధానికి ధర్మం ఉండాలి. నేనెప్పుడూ పోటీలో ఉండాలని కోరుకుంటాను. అయితే నా యుద్ధం ఎప్పుడూ ధర్మం గానే ఉంటుంది. నేనైతే అన్ని సినిమాలూ బాగా ఆడాలని కోరుకుంటాను. నా సినిమా బాగోకపోతే బాగున్న సినిమా ఆడాలని కోరుకుంటాను.” అని తన మనస్తత్వం ఎలాంటిదో చెప్పే ప్రయత్నం చేశాడు గమనార్హం. దీపావళికి పోటీలో ఉన్న సినిమాలకి సంబంధించిన ఒక టీంని లక్ష్యంగా చేసుకొనే ఆయన ఈ మాటలన్నారని అర్థమైపోతుంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/tg-vishwaprasad-sensational-comments-on-the-rajasaab-movie/
త్వరలోనే ఆ టీం బన్నీ వాస్ కామెంట్లపై స్పందించవచ్చని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ‘మిత్ర మండలి’పై నెగటివ్‌గా ట్రోల్ చేస్తోన్న వాళ్లపై ఇప్పటికే సైబర్‌క్రైం డిపార్ట్‌మెంట్‌కి బన్నీ వాస్ ఫిర్యాదు చేశారనీ, ఆ డిపార్ట్‌మెంట్ కొన్ని ఐపీ అడ్రస్‌లని ట్రాక్ చేసే పనిలో ఉన్నాయనీ వినిపిస్తోంది. మొత్తానికి బరిలో నాలుగు సినిమాలుండటంతో దీపావళి రాకముందే టపాసులు పేలుతున్నాయి. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి.


