Singer Zubeen Garg Death Case SIT Investigation: అస్సామీ స్టార్ సింగర్ జుబీన్ గార్గ్ ఇటీవల సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతితో కుటుంబీకులు, దేశవ్యాప్తంగా అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సెప్టెంబర్ 19న సింగపూర్‌లో జరిగిన 20వ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు గార్గ్ వెళ్లారు. అక్కడ తన స్నేహితులతో కలిసి ఓ యాచ్ (బోట్) ట్రిప్ వెళ్లారు. ఈ క్రమంలో సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తుండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్న జుబీన్.. అక్కడికక్కడే మృతి చెందడం కలకలం రేపింది.
అయితే జుబీన్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో.. ఈ కేసు విచారణ కోసం అస్సామీ ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు దర్యాప్తు మొదలు పెట్టిన SIT జుబీన్ మరణించిన సమయంలో ఆయనతో ఉన్నవారందరినీ విచారణ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మ్యుజిషియన్ శేఖర్ జ్యోతి గోస్వామిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
ఘటన జరిగిన రోజు శేఖర్ జ్యోతి గోస్వామి అదే బోట్‌లో ఉన్నారు. దీంతో జుబీన్ మరణానికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవడానికి అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సిట్ బృందం తెలిపింది. ఈ కేసులో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


