రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (Chevella) లో తీవ్ర విషాదం నెలకొంది. ఆలూరు గేట్ వద్ద లారీ అదుపుతప్పడంతో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. లారీ అదుపుతప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. స్థానికంగా కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అంబులెన్సుకి, పోలీసులకి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను సైతం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ప్రమాదం జరగ్గానే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన చూసి స్థానికులు చలించిపోయారు.