నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ గేట్ దగ్గర భారీగా బంగారం (Illegal gold seizure)పట్టుబడింది. కారులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. టోల్ గేట్ వద్ద విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో ఈ బంగారం అక్రమ రవాణా గుట్టు వెలుగులోకి వచ్చింది. ఈ తనిఖీల్లో 4.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. దీని విలువ రూ.3.38 కోట్లు ఉంటుందన్నారు. బిల్లులు లేకుండా చెన్నై నుంచి నెల్లూరులోని ఓ దుకాణానికి తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
సోమవారం సాయంత్రం వెంకటాచలం టోల్ గేట్ వద్ద విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేపట్టారు.. ఈ క్రమంలో చెన్నై వైపు నుంచి వస్తున్న కారును ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కారులో 4 కేజీల బంగారం లభ్యమైంది. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని బిల్లులు లేకుండా.. చెన్నై నుంచి నెల్లూరు లోని ఒక వ్యాపారికి తరలిస్తూ పట్టుబడినట్లు అధికారులు తెలిపారు.
ముగ్గురు అరెస్టు
ఈ ఘటనలో అధికారులు ముగ్గురిని అరెస్టు చేశారు. హర్ష జైన్, అన్న రాం, రంజిత్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన బంగారు ఆభరణాలను, కారును తదుపరి చర్యల నిమిత్తం GST అధికారులకు అప్పగించినట్లు నెల్లూరు విజిలెన్స్ SP రాజేంద్ర కుమార్ తెలిపారు.