దేశ రాజధాని ఢిల్లీలో వరుస దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. శ్రద్ధ హత్యోదంతం తర్వాత ఢిల్లీలో అలాంటి ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో మరో సహజీవన హత్య జరిగింది. మృతురాలి కుమార్తె ఫిర్యాదుతో.. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్ కు చెందిన మన్ ప్రీత్ సింగ్, ఢిల్లీకి చెందిన రేఖారాణి 2015 నుంచి సహజీవనం చేస్తున్నారు. ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలోని రేఖారాణి ఇంట్లోనే ఆమె 15 ఏళ్ల కుమార్తెతో మన్ ప్రీత్ సింగ్, రేఖారాణి ఉంటున్నారు.
ఇద్దరి మధ్యన మనస్పర్థలు ఏర్పడ్డాయా ? లేక ఏదైనా విషయమై వాదోపవాదాలు జరిగాయా ? అన్న విషయం తెలియదు గానీ.. డిసెంబర్ 1న మన్ ప్రీత్ సింగ్ రేఖారాణిని హతమార్చాడు. ఆమె కూతురికి మత్తు మందిచ్చి.. రేఖారాణిని హత్యచేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ గదిలో ఉంచి తాళం వేశాడు. స్పృహలోకి వచ్చిన రేఖారాణి కూతురు.. తన తల్లి ఏదని మన్ ప్రీత్ ను ప్రశ్నించగా..మార్కెట్ కు వెళ్లినట్లు చెప్పాడు. అతని తీరును అనుమానించిన కూతురు తన బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అంతలోనే మన్ ప్రీత్ అక్కడి నుండి ఉడాయించాడు.
మృతురాలి కుమార్తె, బంధువులు రేఖ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేశారు. అందులో భాగంగా తాళం వేసి ఉన్న గదిని తెరిచి చూడగా.. అక్కడ రేఖ విగజీవురాలై కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించి మన్ ప్రీత్ ఆచూకీ కోసం వెతికారు. అతని మొబైల్ సిగ్నల్ ఆధారంగా పంజాబ్ ఉన్నట్లు తెలుసుకుని.. అక్కడికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రేఖారాణి గురించి అతడిని విచారించగా..హత్యానేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.