రాష్ట్ర పోలీస్ కంట్రోల్ కమాండ్ సెంట్రల్ తో 10 లక్షల సీసీటీవీ కెమెరాలు అనుసంధానం అయ్యాయని హైదరాబాద్ సీపీ సి.వి. ఆనంద్ అన్నారు. సెంట్రల్ జోన్ పోలీస్ విభాగం సీసీటీవీ కెమెరాల ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. చిక్కడపల్లి, ముషీరాబాద్, గాంధీనగర్ పరిధిలోని 34 వేర్వేరు ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇందుకు 25 లక్షల విరాళాలిచ్చిన 9 మందిని సీవీ ఆనంద్ అభినందించారు.
కమాండ్ కంట్రోల్ సెంటరుతో కెమెరాలు అనుసంధానం అవ్వడం వల్ల నేరాల నియంత్రణకు ఎంతో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. నగరం, రాష్ట్ర అన్ని విధాలుగా ప్రగతిని సాధించడంలో కీలకంగా వ్యవహిరిస్తున్నాయని వివరించారు. కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం మరోమారు సీసీటీవీ కెమెరాల ఏర్పాట్లుకు దాతలు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కెమెరాల మరమ్మతుల కోసం నగర పోలీసు విభాగం ఆధ్వర్యంలో డి-క్యామో విభాగం చురుకుగా పనిచేస్తోందని వివరించారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, అడిషనల్ డీసీపీ ఏ.రమణ రెడ్డి, చిక్కడపల్లి ఏసీపీ ఏ.యాదగిరి, అబిడ్స్ ఏసీపీ కె.పూర్ణచందర్, సైఫాబాద్ ఏసీపీ ఆర్.సంజయ్ కుమార్, ఇతర పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.