వీళ్లు మాములు దొంగలు కాదు. వీరు ప్రముఖ దేవాలయాల వద్ద ఒంటరి మహిళల ట్రాప్ చేసేందుకు మకాం వేస్తారు. తరచూ ఇంటి అడ్రస్ లు మారుస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతారు. తమిళనాడులో మూడు జిల్లాల పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ముఠాను (Gang arrested) తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరు తిరుమల దర్శనం చేయిస్తామని బాగా మాటలు చెబుతారు. తినేందుకు లేదా ట్రాప్ చేసేందుకు మత్తు మందు ఇస్తారు. స్పృహ కోల్పోయాక ఒంటిపై బంగారు ఆభరణాలు దోచుకొని వెళ్తారు. ఇప్పుడు ఈ ముఠా గుట్టు రట్టు చేశారు తిరుమల పోలీసులు. జనవరి 5 వ తేదీ నమోదు అయినా కేసు విచారణలో మెయిన్స్ బ్లాక్ అయ్యే విషయాలు గుర్తించారు తిరుమల టూ టౌన్ పోలీసులు.

శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో వస్తుంటారు. కొందరు ఒంటరిగా తిరుమలకు వస్తుంటారు. ముఖ్యంగా ఒంటిపై బంగారు ఆభరణాలు ధరించిన భక్తురాళ్లని ఈ ముఠా బాగా టార్గెట్ చేశారు. వీరితో ఈ గ్యాంగ్ త్వరగా దర్శనం కల్పిస్తామని మాయ మాటలు చెప్తారు. నమ్మి వీరితో మాటలు కలిపితే ఇక మన పని అంతే. ముఖంపై మత్తుమందు చల్లిన కర్చీఫ్ పెడుతారు. ఒక్కసారిగా మనం స్పృహ కోల్పోయాక…. ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్లిపోతారని తిరుమల టూటౌన్ సీఐ శ్రీరాముడు తెలియజేశారు.
తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై జిల్లా, విల్లుపురం తాలుకా, వాలిదరెడ్డి గ్రామానికి చెందిన విజయ్ కుమార్ (33), అతని పిన్ని ఆర్. శారద(65)లు దొంగల ముఠాగా ఏర్పడ్డారని చెప్పారు. ఆలయాల వద్ద ఒంటరిగా మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసగించి వారివద్ద ఉన్న బంగారంను స్వాహా చేసేవారని చెప్పారు.
05-01-2025 న ఈ ముద్దాయిలు విజయ్ కుమార్ మరియు వారి పిన్ని శారదలు కలిసి, తిరుమలలో శ్రీవారి రథం వెనక భాగంలో గల గేలరీల వద్ద తమిళనాడుకు చెందిన ఒక మహిళను శ్రీవారి దర్శనం చేయిస్తాము అని నమ్మించి తీసుకువచ్చి ఆమెకి ఆహారములో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి మత్తులో ఉండగా ఆమె నగలు ( బంగారు తాళిబొట్టు చైను, చెవి దుద్దులు) దోచుకుని వెళ్లారు. దీంతో పోలీసులు బాధితురాలిని గుర్తించి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించి ఆమె కోలుకున్న అనంతరం ఆమె ఫిర్యాదుపై తిరుమల వన్ టౌన్ పీఎస్ పోలీసులు కేసును నమోదు చేశారు.

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నిందితులను ముందుగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఛాయాచిత్రాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. పాతనేరస్తులైన ఈ ఇద్దరిపై తమిళనాడు రాష్ట్రం తూతుకుడి జిల్లా, ఎరాల్ పోలీస్ స్టేషన్లో, తిరువన్నామలై వందవాసి సౌత్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు ఉన్నట్లు గుర్తించారు. గురువారం నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, వారివద్ద నుంచి 21 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.45వేలు నగదు, 3 మొబైల్స్ ఫోన్స్, 6 మత్తుమాత్రలు, మారుతీ ఆల్టోకారును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.