అమెరికన్లను మోసం చేస్తున్న కాల్ సెంటర్ నిర్వాహకుల గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు. హైదరాబాద్ కేంద్రంగా ఫేక్ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి అమెరికన్లను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఫేక్ యూఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ కాల్ సెంటర్ బండరాన్ని సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు. ARG సొల్యూషన్ పేరుతో అన్సారీ అనే వ్యక్తి కాల్ సెంటర్ నడుపుతుండగా….దాని పక్కనే AG సొల్యూషన్ పేరుతో మరో కాల్ సెంటర్ నడుపుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ రెండు కంపెనీలు గుజరాత్ లో రిజిస్టర్ అయ్యాయి. నిందితులు కూడా గుజరాత్ వాసులే కావడం గమనార్హం. నిందితులను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో యూఎస్, కెనడా సిటిజన్స్ డేటా సంపాదించి కాల్స్ చేసి స్కాం చేస్తున్నారని సైబరాబాద్ సీపీ తెలిపారు. మెక్సికో నుంచి మీకు పార్సెల్ వచ్చింది.. అందులో డ్రగ్స్ ఉన్నాయి. ఈ రకంగా భయపెట్టి బాధితుల బ్యాంకు డీటెయిల్స్, ఇతర వివరాలు సేకరిస్తున్నారని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
ఇంట్లో లేనపుడు ఇంటిపై కూడా రైడ్ చేశామని.. డ్రగ్స్ సంబంధించిన ఆధారాలు దొరికాయని భయపెడుతున్నారని వివరించారు. యూఎస్ పోలీసులు మీపై రెండు కేసులు పెడుతున్నారని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని అన్నారు. నిర్దోషులుగా ప్రూవ్ చేసుకోవాలంటే యూఎస్ మార్షల్ తో మాట్లాడమని చెప్తున్నారని వెల్లడించారు. ఆ తర్వాత యూఎస్ మార్షల్ గా మాట్లాడి బాధితుల నుంచి 5 నుంచి 6 వేల యూఎస్ డాలర్స్ కట్టించుకుంటున్నారని పేర్కొన్నారు. ఆ డబ్బంతా బిట్ కాయిన్ రూపంలో ఇండియాకు తీసుకువస్తున్నట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మరో కేసులో వెర్టెజ్ సొల్యూషన్ పేరుతో ఫేక్ అమెజాన్ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 120 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తెలివిగా కస్టమర్లకు కాల్ చేసి బురిడీ కొట్టిస్తున్నారని పోలీసులు తెలిపారు. మీ పేరుపై అమెజాన్ డెలివరీ వచ్చింది. కస్టమర్ ఆర్డర్ చేయలేదని చెబితే చెక్ చేసినట్టు నటించి.. మీరే చేసారని మళ్ళీ చెబుతారు. ఆ తర్వాత ఆర్డర్ కాన్సల్ చేయాలంటే మీ బ్యాంకు నుంచి పేమెంట్ అవ్వాలని చెబుతారు. బ్యాంకు వాళ్లలా మాట్లాడి పేమెంట్ ఆపాలంటే కొంత ఫైన్ పడుతుంది.. గిఫ్ట్ కార్డు కొనాలంటూ పేమెంట్ వసూలు చేస్తారని పోలీసులు తెలిపారు. ఆ డబ్బుని బిట్ కాయిన్ రూపంలో మార్చి ఇండియాకి తీసుకొస్తున్నారని పోలీసులు చెప్పారు. ఈ ఫేక్ కాల్ సెంటర్లో పనిచేసే వాళ్లకు అందరికి ఫేక్ కాల్ సెంటర్ అని కూడా తెలుసని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరించారు.