Husband murderd by wife: వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఇలాంటి దారుణమైన ఘటన ఒకటి హైదరాబాద్‌లో జరిగింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే భార్య ప్రియుడితో కలిసి హతమార్చింది. ఈ ఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాలు:
సరూర్నగర్‌కు చెందిన జెల్లెల శేఖర్ (40) వృత్తిరీత్యా డ్రైవర్. ఆయన భార్య పేరు చిట్టి (33). డ్రైవర్‌గా పనిచేసే శేఖర్ అప్పుడప్పుడు రెండు, మూడు రోజులు లేదా వారం రోజుల పాటు బయట ప్రాంతాలకు వెళ్లేవాడు. ఈ సమయంలో చిట్టికి హరీష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. శేఖర్ ఇంటికి వచ్చిన తర్వాత భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని, చిట్టిని పలుమార్లు హెచ్చరించాడు. దీనిపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
హత్య:
భర్త అడ్డుగా ఉండటం భరించలేని చిట్టి, అతడిని అంతం చేయాలని పథకం వేసుకుంది. పథకం ప్రకారం, ఒక రాత్రి ప్రియుడు హరీష్‌ను ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలిసి గాఢ నిద్రలో ఉన్న శేఖర్ గొంతు నులిమి చంపేశారు.
పోలీసుల దర్యాప్తు:
మరుసటి రోజు ఉదయం, ఏమీ తెలియనట్లుగా నటించిన చిట్టి, తన భర్త నిద్రలోనే చనిపోయినట్లు డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో శేఖర్ హత్యకు గురైనట్లు తేలింది. దీంతో పోలీసులు చిట్టి ప్రవర్తనపై అనుమానం పెంచుకుని ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు చిట్టి అంగీకరించింది. దీంతో పోలీసులు చిట్టిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రియుడు హరీష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


