రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కిష్టారావుపల్లె పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యా యత్నం చేసుకోవటం సంచలనం సృష్టిస్తోంది.
కిష్టారావుపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న లంబాడి శ్రీనివాస్ శనివారం రోజు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో గడ్డి మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. అక్కడే ఉన్న మిగతా ఉద్యోగులు వెంటనే అతన్ని అసుపత్రికి తరలించారు. బాధితుడు శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించుకుంటూ ఇటీవలే గురుకుల జూనియర్ లెక్చరర్, మున్సిపాలిటీలో సీనియర్ అకౌంటు మొదలైన ఉద్యోగాలను సాధించాడు. అందులో భాగంగానే పై ఉద్యోగాల నిమిత్తం శ్రీనివాస్ ఎన్ఓసి సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకొని, రిలీవ్ చేయమని కోరగా ఎంపీవో వాజీద్ కావాలని ఆలస్యం చేస్తున్నారని మిగతా సెక్రటరీలు ఆరోపించారు. పైగా ఈ ఉద్యోగాలన్నీ నువ్వు చదివే పాస్ అయ్యావా లేక ఇంకెవరితో ఐనా పరీక్షలు రాయించావా అంటూ ఎంపీవో హేళన చేశాడాంటూ భాధితుడు శ్రీనివాస్ వాపోయాడు.
సెక్రెటరీలను అందరినీ ఎంపీఓ ఇష్టం వచ్చినట్లు దూషిస్తారని సెక్రటరీలు బాహటంగానే అంటున్నారు. ఎంపీడీఓ కూడా తమను వేదిస్తున్నారంటూ పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పై అధికారులు ఈ ఎంపీడీఓ, ఎంపీవోల వేధింపుల నుండి తమను కాపాడాలని మండలంలోని పలువురు పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.
ఈ సంఘటనపై ఎంపీడీఓ, ఎంపీవోలను తెలుగుప్రభ వివరణ కోరగా వృత్తిపరంగా మాత్రమే కార్యదర్శులను పని చేయాలన్నామని మరే ఇతర ఉద్దేశం లేదని అన్నారు. కార్యదర్శులను ఎప్పుడు కూడా తాను ధూషించలేదని ఎంపీవో వాజీద్ వివరణ ఇచ్చారు.