ఎటువంటి వేధింపులు, నేర ప్రవృత్తిని ఎదుర్కొంటున్నా ప్రజలు తనను నేరుగా సంప్రదించవచ్చు అని జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్ తెలిపారు. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఆయన మాట్లాడుతూ ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. కుల, మత, అంతరాలకు అతీతంగా విధులను నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా పోలీసు స్టేషన్ వెళ్ళాలని, ఫిర్యాదు నమోదు చేయాలని కోరారు. ఒకవేళ అక్కడ న్యాయం జరగలేదు అనిపిస్తే తనను నేరుగా సంప్రదించవచ్చు అని వెల్లడించారు. మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తామన్నారు. ఎక్కువ ప్రమాదకరమైన కేసుల్లో సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా కల్పించారు. ప్రజలు, పోలీసుల పరస్పర సహకారంతో మాత్రమే శాంతి భద్రతల పరిరక్షణ వంద శాతం సాధ్యపడుతుంది అని వివరించారు. అందుకు ఇద్దరి మధ్య స్నేహ బంధాన్ని ఫ్రెండ్లీ పోలీసింగ్ మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. యువత నేరాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలు, మద్యం వంటి వ్యసనాలను విసర్జించి ఆరోగ్యకరమైన జీవనం గడపాలని సూచించారు. వారికి తగిన మార్గ దర్శనం చేసేందుకు పోలీసు శాఖ తరపున తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఏసీపీ కట్టా హరిప్రసాద్ నేపథ్యం…
1996వ బ్యాచ్ కు చెందిన కట్టా హరిప్రసాద్ కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్రధాన పోలీసు స్టేషన్ లలో పని చేశారు. ఆయన ఉత్తమ సేవలను గుర్తించి ప్రభుత్వం గతంలో హైదరాబాద్ వెస్ట్ జోన్ నిఘా విభాగ సీఐగా బాధ్యతలు అప్పగించింది. ఇటీవలే ఆయన ప్రతిభకు గుర్తుగా ఏసీపీగా పదోన్నతి పొందారు. జూబ్లీహిల్స్ ఏసీపీగా బాధ్యతలను స్వీకరించారు.