అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు. నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రస్తుతం కటకటాల పాలయ్యారు. ఇది ఎక్కడో కాదు కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న రేకుర్తిలో.
వివరాల్లోకి వెళితే… కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని రేకుర్తికి చెందిన దుర్గం కనకయ్య 2019 సంవత్సరంలో సర్వేనెంబర్ 77లో 2 గుంటల భూమిని అక్రమంగా దుర్గం నారాయణ తోటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సర్వేనెంబర్ 76లో గొల్లే కిష్టయ్య కు 14 గుంటల భూమి ఉంది. గత మార్చి నెలలో కిష్టయ్య తన భూమికి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడుతుండగా కనుకయ్యతో పాటు దుర్గం నారాయణ తాము అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రెండు గుంటల భూమిలో ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నాడంటూ ప్రహరీ గోడ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీంతో ఏప్రిల్ నెలలో కిష్టయ్య సిపి అభిషేక్ మహంతికి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కనకయ్య వద్ద ఉన్నవి నకిలీ పత్రాలు అని తేలడంతో కనకయ్యతో పాటు దుర్గం నారాయణను సైతం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.