సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేదాజ్ఞలను ఈ నెల 30 వరకు పొడిగించినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బరాయుడు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
అనుమతుల్లేకుండా బహిరంగ ప్రదేశాల్లో డేజేలు పెట్టరాదని, విద్యార్థుల పరీక్షలకు ఆటంకాలు సృష్టించరాదని ఆయన వివరించారు. మద్యం ప్రియులు మద్యం సేవించి వీధుల్లో, రోడ్లపై అసభ్యపదజాలంతో మాట్లాడుతుండటం అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమించిందని, వారి ఆగడాలకు కళ్ళెం వేయడంతో పాటు ప్రజల భద్రత, రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాల పరిమితి పొడిగించబడే అవకాశం ఉందన్నారు. ఐపిసి 188, హైదరాబాద్ నగర పోలీసు చట్టం, ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేదాజ్ఞలు ఉల్లఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు హెచ్చరించారు.
.