Constable Nagamani | రాష్ట్రంలో మరోసారి పరువుహత్య కలకలం సృష్టిస్తోంది. కులాంతర వివాహం చేసుకుందన్న కారణంతో సొంత అక్కనే ఓ తమ్ముడు దారుణంగా చంపేశాడు. పోలీసు వర్గాలనూ ఈ వార్త ఉలిక్కిపడేలా చేసింది. సహజంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న జంటలు పెళ్ళికి అంగీకరించని తమ పెద్దల నుంచి రక్షించమని పోలీసులని ఆశ్రయిస్తారు. అలాంటిది ఓ లేడీ కానిస్టేబుల్ నే ప్రేమపెళ్లి చేసుకుందని తమ్ముడు కిరాతంగా చంపడం చర్చనీయాంశం అయింది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ కి చెందిన నాగమణి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో లేడీ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. నెల రోజుల క్రితం తాను ఇష్టపడిన వ్యక్తిని ప్రేమవివాహం చేసుకుంది. అయితే వీరి పెళ్ళికి నాగమణి కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఆమె వారిని కాదని కులాంతర వివాహం చేసుకుంది.
తమని ఎదిరించి పెళ్లి చేసుకుందని కానిస్టేబుల్ నాగమణి (Constable Nagamani) సోదరుడు పరమేష్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. తనని ఎలాగైనా చంపేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాయపోల్ నుంచి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళుతున్న నాగమణిని మాటు వేసి హత్య చేశాడు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఆమెని మన్యగూడ రహదారిపై కారుతో ఢీకొట్టాడు. ఆమె కిందపడిన వెంటనే పరమేష్ కారు నుంచి కిందకి దిగి కత్తితో దాడి చేసి చంపేసినట్టు పోలీసులు గుర్తించారు.