Revenge murder case : కళ్లముందే కన్నీళ్లు పెట్టుకున్నాడు.. తమ్ముడి పాడె మోశాడు.. కానీ, ఆ కన్నీళ్ల వెనుక ఎనిమిదేళ్ల పగ దాగి ఉందని, ఆ పాడెకు కారణం తానేనని ఎవరూ ఊహించలేకపోయారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ హత్యోదంతం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తండ్రి మరణానికి కారణమయ్యాడన్న ప్రతీకారంతో రగిలిపోయిన ఓ అన్న, తమ్ముడిని అత్యంత కిరాతకంగా హత్య చేయించాడు. తనపై ఎలాంటి అనుమానం రాకుండా పకడ్బందీ పథకం రచించి, చివరికి విదేశాలకు పారిపోయాడు.
మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. రిటైర్డ్ పోలీస్ అయిన హనుమాన్ సింగ్ తోమర్‌కు ఇద్దరు కుమారులు. పెద్దవాడు భాను ప్రతాప్ తోమర్, చిన్నవాడు అజయ్ తోమర్. కథ 2017లో మొదలైంది. హనుమాన్ సింగ్‌ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆ దాడి నుండి అజయ్ తోమర్ అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడు.
తండ్రి హత్య వెనుక తమ్ముడి పాత్ర: పోలీసుల దర్యాప్తులో ఈ హత్య వెనుక చిన్న కుమారుడు అజయ్ తోమర్ పాత్ర ఉన్నట్లు తేలింది. కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. ఈ విషయం తెలిసినప్పటి నుండి అన్న భాను ప్రతాప్, తమ్ముడు అజయ్‌పై పగతో రగిలిపోయాడు. తండ్రి చావుకు కారణమైన వాడిని అంతమొందించాలని ప్రతీకారంతో సమయం కోసం ఎదురుచూశాడు.
పక్కా ప్లాన్‌తో హత్య: గత నెల అజయ్ బెయిల్‌పై జైలు నుంచి బయటకు రావడంతో, భాను తన పగ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని భావించాడు. కిరాయి హంతకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన దగ్గరి బంధువులైన మోనేశ్ మరియు 17 ఏళ్ల బాలిక సహాయంతో హత్యకు పక్కా ప్రణాళిక రచించాడు.
ఎరగా బాలిక: పథకం ప్రకారం, ఆ బాలిక అజయ్‌ను మాటల్లో పెట్టి కారులో శివపురి-గ్వాలియర్ హైవే వైపు తీసుకువచ్చింది.
హైవేపై ఘాతుకం: మార్గమధ్యంలో ఓ పెట్రోల్ పంపు వద్ద కారు ఆపమని కోరింది. కారు ఆగగానే ఆమె దిగి పక్కకు వెళ్లిపోయింది. అప్పటికే అక్కడ కాపు కాచిన కిరాయి హంతకులు, అజయ్‌పై తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి పరారయ్యారు. దీంతో అజయ్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.
అన్న నటన.. విదేశాలకు పలాయనం: హత్య జరిగిన తర్వాత, భాను ఏమీ తెలియనట్లు నటించాడు. కుటుంబ సభ్యులకు తానే స్వయంగా విషయం చెప్పి, తమ్ముడి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అందరినీ నమ్మించాడు. అన్ని కార్యక్రమాలు ముగిసిన వెంటనే, ఎవరికీ చెప్పాపెట్టకుండా విదేశాలకు పారిపోయాడు.
చిక్కుముడి వీడిందిలా: ఈ కేసును ఛేదించడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. సుమారు 500 సీసీ కెమెరాల ఫుటేజీలను జల్లెడ పట్టారు. అప్పుడే కీలక ఆధారం లభించింది.
సీసీటీవీలో కారు: నిందితులు హత్యకు ఉపయోగించిన కారు, సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది.
నిందితుడి పేరుతో రిజిస్ట్రేషన్: ఆ కారు నంబర్ ఆధారంగా విచారణ చేయగా, అది భాను తోమర్ పేరు మీదే రిజిస్టర్ అయి ఉండటంతో పోలీసులకు అనుమానం బలపడింది.
నిందితుల అరెస్ట్: సీసీ ఫుటేజీ ఆధారంగా కిరాయి హంతకులను, వారికి సహకరించిన మోనేశ్, మైనర్ బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజం ఒప్పుకున్నారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి భాను తోమరే అని తేలడంతో పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ హత్య వెనుక కుటుంబ కలహాలే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకున్న ప్రధాన నిందితుడు భాను తోమర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని, త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.


