మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్ లో గురువారం అర్థరాత్రి ఉన్నట్టుండి కరెంటు బాక్స్ లో మంటలు చెలరేగడంతో హాస్టల్ విద్యార్థినులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న మొయినాబాద్ పోలీసులు చేరువలోనున్న మల్లన్న దేవాలయంలో ఆశ్రయం కల్పించి రక్షణ కల్పించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య సంక్షేమ హాస్టల్ ను సందర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని విద్యార్థులకు ధైర్యం చెప్పారు. సంబంధిత విద్యుత్ అధికారులను పిలిపించి అక్కడి పనులను పూర్తి చేయించారు. జిల్లా కలెక్టర్ తో, సంబంధిత అధికారులతో మాట్లాడారు. హాస్టల్ వార్డెన్ కు పలు సూచనలు చేశారు. విద్యార్ధులను తన సొంత పిల్లలుగా భావించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య కోరారు.
కాగా ఉంటే.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అప్రత్తమైన విద్యాశాఖ రెండు రోజులు సెలవు ప్రకటించినా.. గురుకులాల నిర్వాహకులు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. సంక్షేమ హాస్టల్ లలో మౌలిక వసతులు, సీవరెజీ, విద్యుత్, వాటర్ తదితర అంశాలపై దృష్టి పెట్టడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత ఆర్.సి.ఓ. శారదా వెంకటేష్ సంక్షేమ హాస్టళ్ళ మౌలిక వసతుల కల్పన వాటి నిర్వహణ భాద్యతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో శ్రద్ధ చూపితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని, ఆర్.సి.ఓ.కు ఎప్పుడు ఫోన్ చేసిన సమాధానం ఉండదని పలువురు ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంక్షేమ హాస్టళ్ళలో ఇలాంటి ఘటనలు జరుగకుండా సంబంధిత ఆర్.సి.ఓ. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.