రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ రవాణా-వినియోగం మీద ఉక్కు పాదం మోపుతామని కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ పేర్కొన్నారు. బండ్లగూడలోని జిఎస్ఐ ఆడిటోరియంలో ఎన్డిపిఎస్ కేసుల ప్రొసీజరల్ ఎక్సలెన్స్ సెమినార్, వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ పై స్థాయి అధికారులకు నిషేధిత డ్రగ్స్ కేసుల విచారణకు ఉపకరించే హ్యాండ్ బుక్ మాన్యువల్ అందించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. నిషేధిత మత్తు పదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపురుగు వంటిదని, డ్రగ్స్ వినియోగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కమిషనర్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ రవాణా, వినియోగం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద క్రమం తప్పకుండా చేస్తున్న తనిఖీలతో పాటు, ప్రత్యేక ఎస్ఓటి బృందాలు ఏర్పాటు చేసి చేపడుతున్న ఆపరేషన్ల ద్వారా ఎన్నో గంజాయి, ఓపియం, హెరాయిన్ వంటి ఇతర నిషేధిత డ్రగ్స్ సరఫరా ముఠాలను పట్టుకొని కేసులు నమోదు చేశామన్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలను అణచివేయాలని, వారి మీద పిడి చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు.
తెలిసీ తెలియక మత్తు పదార్థాల బారిన పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని, యువత యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని మత్తు పదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని కమిషనర్ అన్నారు.నిషేధిత డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని సూచించారు. మత్తు పదార్థాల రవాణా మీద ఎన్నో దాడులు చేస్తున్నామని, ఎంతో మందిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీపీ తెలిపారు. యువతలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పట్ల అవగాహన కల్పించేలా కళాశాలల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ డి.జానకి ఐపీఎస్, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్ ఐపీఎస్, ఎస్ఓటి డీసీపీ గిరిధర్ ఐపీఎస్, ఎల్బీ నగర్ డీసీపీ సాయి శ్రీ,ఎస్ఓటి డీసీపీ మురళీధర్,ఇతర ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.