Roof Collapse At Dargah Near Humayun’s Tomb Kills 6: దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న పట్టీ షా దర్గాలో ఒక గది పైకప్పు కూలిపోవడంతో ఆరుగురు మరణించారు. మృతులలో 80 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు కాగా, వారిని చికిత్స కోసం ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో శుక్రవారం ప్రార్థనల కోసం ప్రజలు దర్గాను సందర్శిస్తున్నారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. ఈ దర్గా హుమాయున్ సమాధి సమీపంలో ఉంది. ఈ భవనం సుమారు 25-30 ఏళ్ల క్రితం నిర్మించి ఉండవచ్చని సమాచారం.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీఎంఏ) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పోలీసులు మూసివేశారు.
శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమో అని సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఆ గదిలో దాదాపు 15-20 మంది ఉన్నట్లు అనధికారిక నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఘటన స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.


