మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాలకి పాల్పడిన కేసులలో దర్యాప్తు వేగవంతం చేసి న్యాయస్థానాల ద్వారా కఠిన శిక్షలు విధించడం జరుగుతుందని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా( DGP Harish Kumar Gupta) తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే దాడులను ఉక్కుపాదంతో అణచివేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
విజయనగరం జిల్లా పరిధిలో చిన్నారులపై జరిగిన ఆఘాయిత్యాల (POCSO) కేసుల్లో నిందితులకు 3 నెలల నుండి 6 నెలల లోపే శిక్షలు ఖరారు చేయడంలో విజయం సాదించిన విజయనగరం పోలీసులను ఈ సందర్భంగా డీజీపీ అభినందించారు. మహిళలు, పిల్లలపై నేరాలకు పాల్పడే వారు శిక్షల నుండి తప్పించుకోలేరని అన్నారు.
మహిళలు, చిన్నారులపై నేరాలను నివారించడానికి ఐజీ ర్యాంకు అధికారి నేతృత్వంలో “వుమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్” ను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు “శక్తి” యాప్ ను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. ఈ శక్తి యాప్ కు పలు అదునాతన ఫీచర్ లను జోడించడం జరిగిందన్నారు.