Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుThimmapur: రైస్ మిల్లులో అర్ధరాత్రి హైడ్రామా

Thimmapur: రైస్ మిల్లులో అర్ధరాత్రి హైడ్రామా

బీహార్ వాసి కావడంతో లెక్కచేయని యాజమాన్యం

కార్మికుల ప్రాణాలంటే ఆ మిల్లు యాజమాన్యానికి లెక్కే లేకుండా పోయింది. మిల్లులోకి వచ్చిన ఓ డీసీఎం వ్యాను పనులు ముగించుకొని నిద్రిస్తున్న కూలీపైకి ఎక్కడంతో కార్మికుడి ప్రాణాలను గాల్లో కలిపింది. కార్మికుడు బీహార్ వాడు కావడాన్ని ఆసరాగా చేసుకున్న మిల్లు యాజమాన్యం అతడు పనిచేస్తూ చనిపోలేదు కదా..? అంటూ నిర్లక్ష్యపు సమాధానమిస్తూ ప్రాణమంటే విలువ లేకుండా చేసింది.

- Advertisement -

కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన కిషోర్ (39) అనే వ్యక్తి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ గ్రామంలో గల భాస్కర రైస్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజువారి పనులు ముగించుకొని శనివారం రాత్రి మిల్లులోని రేకులషెడ్డు కింద నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో మిల్లులోకి వచ్చిన ఓ వ్యాన్ రివర్స్ తీసుకుంటుండగా కార్మికుడు కిషోర్ పైకి ఎక్కింది. దీంతో కిషోర్ అక్కడికక్కడే చనిపోయాడు. మిల్లులో కిషోర్ చనిపోయిన విషయాన్ని గమనించిన మిల్లు యాజమాన్యం మృతదేహాన్ని రాత్రికి రాత్రే రహస్యంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది.

అసలేం జరిగిందంటే?

భాస్కర రైస్ మిల్లు యాజమాన్యం మిల్లులోని కొంత షెడ్డును పంజాబ్ కు చెందిన ఓ కోడిగుడ్ల వ్యాపారికి లీజుకు ఇచ్చింది. కోడిగుడ్లు సరఫరా చేసే వ్యాను శనివారం ఆ షెడ్డు దగ్గరికి వచ్చింది. అదే రోజు రాత్రి వర్షం పడడంతో వ్యాన్ డ్రైవర్ ఆ వ్యానును షెడ్డు కిందికి తరలిస్తుండగా షెడ్డు కింద నిద్రిస్తున్న కిషోర్ పైకి ఎక్కగా అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని అర్ధరాత్రి జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించిన కోడిగుడ్ల వ్యాపారి, మిల్లు యాజమాన్యం ఆదివారం ఉదయం కిషోర్ కుటుంబ సభ్యులు, పెద్దమనుషులతో బేరసారాలకు దిగింది. ప్రాణం ఖరీదుగా రూ.3.5లక్షలు ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా కిషోర్ కుటుంబ సభ్యులకు నెలకు రూ. 10వేల చొప్పున సంవత్సరం పాటు ఇచ్చేందుకు సదరు వ్యాపారితోపాటు రైస్ మిల్ యాజమాన్యం ఒప్పుకుంది.

మిల్లు యాజమాన్యంపై కార్మికుల తీవ్ర అసంతృప్తి..

రైస్ మిల్ నడవాలంటే కార్మికుల కృషి ఎంతో అవసరం. అలాంటిది ఓ కార్మికుడు చనిపోతే ‘పనులు చేస్తూ చనిపోలేదు కదా..’ అంటూ యాజమాన్యం మాట్లాడడంపై కార్మికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కార్మికుడి ప్రాణాలకు విలువివ్వని యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు కనీస వసతులు కల్పించడం లేదనీ, సరైన సదుపాయాలు లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News