నిండైన మనసుతో పూజించే పేద భక్తులకు భగవంతుడు దాసుడని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తమిళనాడు క్రిష్ణగిరి జిల్లా గోప సంద్రం లోని దక్షిణ తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నుండి తిరుమలకు పాదయాత్రగా వస్తున్న వందలాది మంది భక్త బృందానికి శ్రీనివాస మంగాపురంలో ఛైర్మన్ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ కరుణాకర రెడ్డి మాట్లాడుతూ, భగవంతుని సేవకు పాదయాత్ర పెద్ద సాధనమని అన్నారు. స్వామి వారిని పేదలు దర్శించే క్షణ కాలమే భగవంతుడు వారిని చూస్తాడన్నారు. విఐపిలు గంటల సమయం దేవుడి ఎదురుగా ఉన్నా ఆయన చూపు పేదల మీదే ఉంటుందని చెప్పారు. వందలాది సంవత్సరాలుగా ఎందరో మహానీయులు కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకుని తరిస్తున్నారని చెప్పారు . పూర్వం శ్రీపురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తి ప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్నిదశ దిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలన్నారు.
జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరిండెంట్ శ్రీ చెంగల్ రాయులు, దక్షిణ తిరుపతి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనారాయణ స్వామి, వందలాది మంది పాద యాత్ర భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.