తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకొని వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం కాశీ పీఠాధిపతి వీరశైవ జగద్గురు శ్రీ మల్లికార్జున విశ్వారాధ్య శివాచర్య మహాస్వామి ఆధ్వర్యంలో కొమురవెళ్లి మల్లన్న కళ్యాణం నిర్వహించారు.
సర్వాంగ సుందరంగా అలంకారం
అర్చకులు స్వామివారి కళ్యాణంలో వరుడు మల్లికార్జున స్వామి తరుపున కన్యా గ్రహీతలుగా పడిగన్నగారి వంశస్థులు, మేడలమ్మ, కేతమ్మ అమ్మవార్ల తరుపున కన్యాదాతలుగా మహాదేవుని వంశస్థులు తంతు నిర్వహించారు. అనంతరం దేవతా మూర్తులకు పట్టువస్త్రాలు,పూలమాలలు ధరింపచేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు.
50 వేల మంది హాజరు
స్వామివారి కళ్యాణం సందర్భంగా ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. మల్లన్న కళ్యాణానికి సుమారు 50,000 మంది భక్తులు హాజరైనట్టు అలయాధికారుల అంచనా కళ్యాణం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 380మందితో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
స్వామివారి కళ్యాణంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు.