మనం ఉదయం లేచింది మెుదలు శుభ్రంగా స్నానం చేసేసి దేవుడికి పూజ చేసుకుంటాం. అనంతరం హారతి పడుతుంటాం. దీంతో ఓ విధమైనా ఆధ్మాత్మిక భావన మనసులో వెల్లివిరుస్తుంది. అలాగే ఈ హారతిని ఎందుకివ్వాలి. దీని వెనుక ఉన్న రహాస్యం ఏమిటో తెలుసుకున్నారా. అయితే ఈ హారతుల్లోనే చాలా రకాలు ఉన్నాయన్నా విషయం చాలా మందికి తెలియదు. అయితే ఈ విషయాలు తెలుసుకోండి.

హారతి ఎందుకు ఇస్తారంటే
హారతి ఇవ్వటమనేది పురాతన సంప్రదాయంలో ఒక్కటి. కాంతి, ధ్వనిని భగవంతునికి అర్పించడమనేది భక్తికి ప్రతీక. దేవుని దీవెనలు కోరడం. గంట కొడుతూ హారతి ఇవ్వడం దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు తెలుపుతున్నారు.
హారతుల రకాలు
ఏక హారతి
ప్రతిదీ ఒకే విధంగా ఉండడానికి ప్రత్యేకించి అంతరంగాలు ఒక నిశ్చల స్థితిలో ఉండేందుకు దోహదం చేసేదానిని ఏక హారతి అంటారు. ఇది నదుల్లోని ఔషధ గుణాలు పెరగడానికి కూడా తోడ్పడుతుందని చెబుతున్నారు.
బిల్వ హారతి
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఇచ్చే నీరాజనం ఇది. మనం చేపట్టిన ప్రతి పనినీ త్రికరణ శుద్ధితో చేసే ప్రేరణనిచ్చి అన్నింటా విజయాల్ని సాధించే శక్తిని ఇస్తుంది ఈ బిల్వ హారతి.
పంచ హారతి
ఇది పంచ భూతాలకు ఇచ్చే హారతి కనుక దీనిని పంచ హారతి అని అంటారు. ప్రత్యేకించి పంచ భూతాల్లోని జలానికి ఇచ్చే నీరాజనం. ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా సమస్త మానవాళి సుభిక్షంగా ఉండేలే ఇచ్చే హారతిగా చెప్పవచ్చు.
రుద్ర హారతి
రుద్ర అంటే శివుడు అని కాదు. రుద్ర అంటే ఇక్కడ మంగళం అని అర్థం. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఇచ్చే హారతి ఇది.
చక్ర హారతి
చక్రం విష్ణుమూర్తి కుడి చేతిలో ఉంటే ఇది గురువు ఎడమ చేతిలో ఉంటుంది. ఈ హారతి వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం లేకపోతే కైవల్యమే ఉండదు కాబట్టి ఈ హారతిని ఎంతో ఉత్కృష్టమైనదిగా భావిస్తారు.
సింహ హారతి
ఇది ప్రతి ఒక్కరూ విజయ శిఖరాలకు చేరాలని ఇచ్చే హారతి. ప్రత్యేకించి ప్రభుత్వాలు ప్రారంభించే కొత్త కార్యక్రమాలన్నీ నెరవేరాలని ప్రజలు, ప్రభుత్వం సుభిక్షంగా ఉండడానికి ఇచ్చే హారతి.
నవగ్రహ హారతి
మన జీవితాల్ని నడిపే నవ గ్రహాలే దోషాల పాలైతే జీవితం సాఫీగా సాగదు. అందుకే నవ గ్రహాల దోషాలను తొలగించేందుకు ఈ నవగ్రహ హారతి పడతారు.
కుంభ హారతి
ప్రతి మంచి పనికీ స్వాగతం పలకడానికి, నరఘోషతో పాటు సమస్త దిష్టి దోషాలు తొలగిపోవడానికి ఈ హారతి పడతారు.
నేత్ర హారతి
దివ్య స్వరూపమైన పరమాత్మ అనుగ్రహం అందరికి లభించాలని ఇచ్చే హారతినే నేత్ర హారతి అని అంటారు. దీనివల్ల సమస్త దృష్టి లోపాలు తొలగిపోతాయని విశ్వాసం.
నృత్య హారతి
పరమేశ్వర స్వరూపమైన సమస్త కళలూ దేదీప్యంగా వెలుగొందడానికి ఇచ్చేదే ఈ నృత్య హారతి. నృత్యం జీవ చైతన్యానికి ప్రతీక కాబట్టి నృత్య హారతి ఇవ్వడం ద్వారా మానవ జీవితాలు సమస్తం నిత్యం చైతన్యంతో వెలుగొందుతాయి.
రథ హారతి
ద్వైమూర్తులందరికీ రథాలు ఉంటాయి. రథహారతి ఇవ్వడం వల్ల అందరికీ రథాలు అంటే వాహనాలు కలిగేందుకు దోహదం చేసేదే ఈ రథహారతి.
వృక్ష హారతి
సమస్త వృక్ష సంపదంతా అపారంగా పెరిగి స్వచ్ఛమైన ప్రాణ వాయువును ఇవ్వడం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతూ ఇచ్చేదే వృక్షహారతి.
అఖండ కర్పూర హారతి
సమస్త లోకాలు శాంతంగా ఉండాలని కర్పూరంతో పట్టేదానిని అఖండ కర్పూర హారతి అని అంటారు.
నక్షత్ర హారతి
ప్రతి మనిషిలోనూ నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలనే దోషాలు ఆవరిస్తే సమస్యలు మొదలవుతాయి. ఆ దోషాలన్నీ తొలగిపోవాలని ఈ నక్షత్ర హారతిని ఇస్తారు.
నాగ హారతి
ఈ రోజుల్లో ఎక్కువ మంది సంతాన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి కాల సర్ప దోషాలు ఉండచ్చు. ఈ నాగ హారతిని ఇస్తే ఆ సమస్యలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని భక్తుల విశ్వాసం.
ధూప హారతి
భూలోకంలో ఉండే సమస్త కాలుష్యాల్ని తొలగించి సూర్యకిరణాలు సంపూర్ణంగా భూమిమీద పడాలని పర్యావరణం చక్కగా ఉండాలని భక్తితో ఇచ్చేది ధూప హారతి.