Wednesday, April 2, 2025
HomeదైవంOntimitta: ఏప్రిల్ 11న ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

Ontimitta: ఏప్రిల్ 11న ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

అత్యంత చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న ఒంటిమిట్ట(Ontimitta) శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు.

- Advertisement -

సోమవారం ఒంటిమిట్ట టిటిడి కళ్యాణ మండపం సమీపంలోని పరిపాలన భవన సమావేశ మందిరంలో… ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ జెఈఓ వీరబ్రహ్మం, డిఆర్వో విశ్వేశ్వర నాయుడు లతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులు, టీటీడీ అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఏప్రిల్ 5వ వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు.

ముఖ్యంగా ఎప్రిల్ 11వ తేదీన జరిగే సీతారాములవారి కళ్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు ప్రముఖులు, అత్యంత ప్రముఖులు రావచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఆ మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిల్లా, టీటీడీ, పోలీస్ అధికారులు సంయుక్తంగా, నిర్దిష్ట ప్రణాళికలతో విధులను నిర్వర్తించాలన్నారు. రాములవారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు కళ్యాణవేదిక ముందు ఏర్పాటు చేసిన ఒక్కో గ్యాలరీకి ఒకరిని ఇంఛార్జిగా నియమిస్తామన్నారు. ఎక్కడా కూడా జనం తొక్కిసలాట జరుగకుండా అధికారులు, పోలీస్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రసాదం కౌంటర్ల వద్ద ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతిఒక్కరికీ తాగునీరు, అన్న ప్రసాదం కొరత లేకుండా అందేలా చూడాలన్నారు.

అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాలనుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకుని పక్కాగా ప్లాన్ రూపొందించుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఒకవేళ పార్కింగ్ దూరంగా ఉంటే అక్కడి నుంచి కళ్యాణవేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేయాలని టిటిడి జేఈవోకు తెలిపారు. వాహనాల పార్కింగ్ వద్ద టోయింగ్ వాహనాలను సిద్ధంగా ఉంచాలని సంభందిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కళ్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ప్రత్యేక విద్యుత్ దీప అలంకరణతో అర్చిలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక, కనీస వసతులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. భద్రతా ఏర్పాట్లు, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, తాగునీరు, భక్తులకు అన్నప్రసాదాలు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కంట్రోల్, ఆర్టీసీ రవాణా సౌకర్యం, సూచిక బోర్డులు ఏర్పాటు, కంట్రోల్ రూం ఏర్పాటు, సీసీ కెమెరాలు, విద్యుత్, అగ్నిమాపక వాహనాలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, 108 వాహనాలు, అత్యవసర మందులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, తాత్కాలిక మెడికల్ క్యాంపులు, అక్కడక్కడ హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు మొదలైన అన్ని అంశాలను ఎలాంటి కొరత లేకుండా.. ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

రాత్రి వేళలో కల్యాణోత్సవం చేస్తున్నందున విద్యుత్ దీపాలంకరణ తో పాటు.. అత్యంత పటిష్ట చర్యలను కూడా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుదీకరణ, తోరణాలు, పుష్పాలంకరణ, స్వాగత ఆర్చిలు, ఎల్‌ఇడి బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. టిటిడి అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీసులు స‌మిష్టి కృషి చేసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గ్యాలరీ వద్ద గట్టి భద్రతా చర్యలు చేపడతామన్నారు. గతంలో నిర్వహించిన శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాల అనుభవాలను గుర్తుంచుకొని.. ఎక్కడా, ఎలాంటి చిన్న పొరపాటుకు కూడా అవకాశం లేకుండా.. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు టిటిడి విజిలెన్స్& సెక్యూరిటీ అధికారులు సంపూర్ణ సహకారాలు అందించాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా.. ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామన్నారు. అన్ని పార్కింగ్ ప్రదేశాల వద్ద ప్రత్యేక పోలీసు భద్రతా సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. వాహనల ద్వారా వచ్చే భక్తులకు, బస్సుల ద్వారా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు చేపట్టామన్నారు.

టీటీడీ జెఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ.. టిటిడిలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగం, పోలీసులు స‌మిష్టి కృషి చేసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గ్యాలరీ వద్ద శ్రీవారి సేవకులను నియమిస్తామన్నారు. గతంలో నిర్వహించిన శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాల అనుభవాలను గుర్తుంచుకొని.. ఎక్కడా, ఎలాంటి చిన్న పొరపాటుకు కూడా అవకాశం లేకుండా.. ఈ ఏడాది కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు టిటిడి తరపున సంపూర్ణ సహకారాలు అందిస్తామన్నారు.

బ్రహ్మోత్సవ కార్యక్రమాల వివరాలు..
ఏప్రిల్ 5వ తేదీ బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయని, 6వ తేదీ శ్రీరామనవమి రోజున మొదటి రోజు ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభం, పోతన జయంతి, కవి సమ్మేళనం, సాయంత్రం శేష వాహన అలంకారం కార్యక్రమాలు జరుగుతాయి. ఏప్రిల్ 7వ తేదీ వేణు గానాలంకారం, హంస వాహనం, ఏప్రిల్ 8వ తేదీ వటపత్ర శాయి అలంకారం, సింహ వాహనం, 9వ తేదీ నవనీత కృష్ణాలంకారం, హనుమత్సేవ. 10వ తేదీ మోహినీ అలంకారం, గరుడసేవ 11వ తేదీ శివదనుర్బంగాలంకారం, సాయంత్రం సీతారాముల కల్యాణాన్ని, గరుడ వాహన సేవలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్య పట్టు వస్త్రాలు సమర్పిస్థారని సమాచారం. 12న రథారోహణం, రథోత్సవము, ఏప్రిల్ 13న కాళీయమర్థనాలంకారం, అశ్వవాహనం. 14వ తేదీన చక్రస్నానము, మహాపూర్ణాహుతి, ధ్వజావారోహణం, 15న పుష్పయాగము జరుగనుంది.

ఆలయ దర్శనం, కళ్యాణ వేదిక పరిశీలన :
అంతకు మునుపు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తితిదే అధికారులు, జిల్లా అధికారులతో కలిసి.. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి.. ప్రత్యేక పూజలు నిర్వహించి.. తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం దేవస్థానం సమీపంలోని శ్రీకోదండరామ స్వామి కల్యాణ వేదికను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి కల్యాణ వేదిక, గ్యాలరీలు, రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లినింగ్ వంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసి సలహాలు, సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కడప, జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చిన్నయ్య, టిటిడి డిప్యూటీ ఈవో నగేష్, డిఆర్డీఏ పీడి ఆనంద్ నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా ఫైర్ అధికారి ధర్మారావు, డిఎంహెచ్ఓ డా.నాగరాజు, సిపివో వెంకటరావు, డీపీఓ, పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, ఏపిఎస్పిడిసిఎఎల్ ఎస్ఈ రమణయ్య, డిటిసి, ఆర్టీసీ అధికారులు, టిటిడి, ఈ&పీఆర్ పిఆర్వోలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News