Sunday, November 16, 2025
HomeదైవంVinayaka Chaviti: వినాయక చవితి నాడు చంద్రున్ని చూస్తే ఏమౌతుందో తెలుసా!

Vinayaka Chaviti: వినాయక చవితి నాడు చంద్రున్ని చూస్తే ఏమౌతుందో తెలుసా!

Vianyaka Chaviti Vs Moon : భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి రోజున గణేష్ చతుర్థి పర్వదినాన్ని భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. బుద్ధి, విజయాన్ని ప్రసాదించే గణపతి జన్మదినంగా ఈ పండుగను హిందువులు పవిత్రంగా భావిస్తారు. ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27వ తేదీకి వచ్చింది. తొమ్మిది రోజుల పాటు భక్తులు గణపతిని ఆరాధిస్తూ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంలో గణపతిని పూజించే సమయంలో అనుసరించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. వాటిని పాటించకపోతే శుభానికి బదులు అశుభం కలుగుతుందని పురాణాలు,పండితులు చెబుతున్నారు. అందులో ముఖ్యమైన అంశం వినాయక చవితి నాడు చంద్రుడిని చూడకూడదు అనే విషయం.

- Advertisement -

చంద్రుడిని చూడటం..

హిందూ శాస్త్రాల ప్రకారం వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం అశుభంగా పరిగణిస్తారు. ఈ రోజున చంద్రుడి దర్శనం కలిగితే భవిష్యత్తులో అనవసరమైన అపవాదులు, అపఖ్యాతి ఎదురయ్యే అవకాశం ఉందని నమ్మకం ఉంది. అందుకే ఈ తేదీని కళంక చతుర్థి అని కూడా అంటారు. చంద్ర దర్శనాన్ని నివారించడం ద్వారా దోషాలను దూరం చేసుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

అందం, కాంతి గర్వంతో

ఈ విశ్వాసం వెనుక ఉన్న కథను పూరాణాలు చెబుతున్నాయి. ఒకసారి గణేశుడు తన తల్లి పార్వతి, తండ్రి శివుని చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవతలందరి ఆరాధ్యుడిగా నిలిచాడు. ఈ సంఘటన తర్వాత ముక్కోటి దేవతలంతా గణపతిని పూజించారు. కానీ చంద్రుడు తన అందం, కాంతి గర్వంతో గణపతిని నిర్లక్ష్యం చేశాడు. ఆ అహంకారాన్ని చూసిన గణేశుడు కోపంతో చంద్రుడిని శపించి అతని రూపాన్ని నల్లగా మార్చేశాడు. వెంటనే తన తప్పును గ్రహించిన చంద్రుడు క్షమించమని గణేశుని వేడుకున్నాడు. అప్పుడు గణపతి తన శాపానికి విముక్తి మార్గాన్ని సూచించాడు. సూర్యుని కాంతి తనపై పడగానే మునుపటి రూపం తిరిగి వస్తుందని గణేశుడు అన్నాడు.

వినాయక చవితి కావడంతో…

ఈ సంఘటన జరిగిన రోజు వినాయక చవితి కావడంతో, ఆ రాత్రి చంద్రుడిని చూడటం శాస్త్రప్రకారం నివారించాల్సిన నియమంగా మారింది. అందువల్లే ఈ రోజున చంద్ర దర్శనం అపశకునంగా పరిగణిస్తారు.

భక్తులు తరచుగా ఒక ప్రశ్న అడుగుతారు. వినాయక చవితి రోజున అనుకోకుండా చంద్రుడిని చూసినప్పుడు ఏమి చేయాలి? ఈ దోషం తగ్గించుకోవడానికి శాస్త్రాల్లో కొన్ని పరిహారాలు సూచించడం జరిగింది. మొదటగా, గణపతిని భక్తితో పూజించి పూలు, పండ్లు సమర్పించాలి. ఆ సమర్పణను చంద్రునికి చూపించి ఆ తరువాత ఒక పేదవాడికి దానం చేయాలి. ఇది చేసినప్పుడు అపవాదులు దూరమవుతాయని నమ్మకం ఉంది.

అదే సమయంలో ఒక ప్రత్యేక మంత్రాన్ని భక్తితో పఠించాలి. ఆ మంత్రాన్ని హృదయపూర్వకంగా జపించడం ద్వారా అపఖ్యాతి దోషం తొలగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధానం ద్వారా చంద్ర దర్శనంతో కలిగే ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి.

Also Read: https://teluguprabha.net/devotional-news/how-to-worship-lord-shiva-for-blessings-and-fulfillment/

భక్తులు గణేష్ చతుర్థి రోజున ఆచరించే ప్రతి నియమం వెనుక ఒక ఆధ్యాత్మిక ఉద్దేశం ఉంది. చంద్ర దర్శనం నివారణ కూడా అటువంటి నియమాల్లో ఒకటి. దీని ద్వారా మనిషి అహంకారాన్ని వదలి వినయంతో ఉండాలని సూచన ఉంది. చంద్రుడి కథ ద్వారా గర్వం, అహంకారం చివరికి దుర్గతికి దారితీస్తుందని గణేశుడు నేర్పించాడు. అదే సమయంలో తప్పు గ్రహించి పశ్చాత్తాపం చెంది క్షమాపణ కోరితే మళ్లీ శ్రేయస్సు సాధ్యమని కూడా ఈ పురాణకథ చెబుతుంది.

భక్తి, శ్రద్ధ, ఆచారాలతో…

వినాయక చవితి పర్వదినం భక్తి, శ్రద్ధ, ఆచారాలతో నిండి ఉంటుంది. భక్తులు గణపతికి ప్రీతిపాత్రమైన మోడకాలు, పులిహోర, లడ్డు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. ప్రత్యేకంగా ఈ రోజున గణపతి బాపా మోరియా అంటూ ఉత్సాహంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పూజలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. చివరి రోజున గణపతిని నదులు, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.

అయితే ఈ ఉత్సవాల్లో భక్తులు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశం చంద్ర దర్శనం నియమం. ఎందుకంటే అనుకోకుండా చూసినా పరిహారం పాటించడం తప్పనిసరి. శాస్త్రాలు సూచించిన విధానాన్ని అనుసరించడం ద్వారా దోషాలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad