కర్నూలు జిల్లా నందవరం మండల పరిధిలోని గురజాల గ్రామంలో తుంగభద్రా నది తీరాన మహా శివరాత్రి ఉత్సవాలకు శ్రీ గురుజాల రామలింగేశ్వర స్వామి దేవాలయం ముస్తాబైంది. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటైన శ్రీ గురజాల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో.. త్రేతాయుగంలో శ్రీ సీతారా ముల వారిచే ప్రతిష్టించబడిన సైకతలింగం, కాశీ నుండి ఆంజనేయ స్వామి తెచ్చి ప్రతిష్టించబడిన కాశీ లింగం, పాండవులచే ప్రతిష్టించబడిన ధర్మ, పార్థ, భీమ లింగాలను కలిపి శ్రీ పంచలింగాలున్నాయి.
- Advertisement -
ఎలా చేరుకోవాలి ?
శ్రీ గురజాల రామలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మూడు బస్సు మార్గాలలో గురజాల గ్రామం చేరుకోవచ్చు.
- కర్నూల్ టు ఎమ్మిగనూరు 69 కిలోమీటర్లు, ఎమ్మిగనూరు టు గురజాల 24 కిలోమీటర్లు.
- కర్నూల్ వయా సుంకేసుల ప్రాజెక్టు మీదుగా గురజాల 55 కిలోటర్లు
- మంత్రాలయం వయా నాగలదిన్నె మీదుగా గురజాల 20 కిలోమీటర్లు
పూజా కార్యక్రమములు:-
18 ఫిబ్రవరి శనివారం (మహాశివరాత్రి) రోజున యాగమంటప ప్రవేశం, గణపతి పూజ, కలశ స్థాపనము, అంకురార్పణము, శతరుద్రాభిషేకము మరియు శక్తిస్వరూపిణి శ్రీ పర్వతవర్ధనీదేవి అమ్మవారికి కుంకుమార్చన, రాత్రి గం.7-00 ల నుండి 9-00 ల వరకు నటరాజ కళాక్షేత్రం, ఎమ్మిగనూరు వారిచే కూచిపూడి నృత్యప్రదర్శన కార్యక్రమం. రాత్రి గం.9-00 ల నుండి 12-00 ల వరకు గీతా మందిరం, ఎమ్మిగనూరు వారిచే శివగాణామృతం కార్యక్రమం నిర్వహించబడును. రాత్రి 12-00 గంటలకు లింగోద్భవ సమయమున క్షీరాభిషేకము, రుద్రాభిషేకము, రాత్రి 2-00 గంటలకు శ్రీ పర్వతవర్ధనీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవము (గీతా మందిరం వారిచే పట్టువస్త్రాలు సమర్పణ) తదనంతరం ప్రభోత్సవము జరుగును. 19 ఫిబ్రవరి ఆదివారం రోజున సాయంత్రం గం.5:00 లకు మహారథోత్సవం.
20 ఫిబ్రవరి సోమవారం రోజున శ్రీ రామలింగేశ్వర స్వామికి అభిషేకం మరియు అన్నసంతర్పణం (అన్నదానం) రాత్రి 9-00 గంటలకు పారువేట జరుగును.
21 ఫిబ్రవరి మంగళవారం రోజున ఉదయం గం.10-00 లకు అభిషేకము, వసంతోత్సవము, దేవస్థానము వారిచే వేదపండితులకు గౌరవ సన్మానం జరుగును.
దేవాలయ విశిష్టతలు
త్రేతా యుగంలో శ్రీ రామ, రావణ యుద్ధంలో శ్రీరాముల వారి చేతిలో బ్రాహ్మణుడైన రావణబ్రహ్మ మరణించాడు. దీంతో బ్రాహ్మణ హత్య దోష నివారణకై రామేశ్వరం నుండి అయోధ్య వరకు శివలింగ ప్రతిష్ట చేసి పూజలు నిర్వహించిన బ్రాహ్మణ హత్య దోష నివారణ జరుగుతుందని సీతా రాములవారు రామేశ్వరం నుండి శివలింగ ప్రతిష్టలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో అప్పటి దండకారణ్యం మైనటువంటి గురజాల పరిసర ప్రాంతంలో తుంగభద్ర నది తీరాన శివలింగాలు ప్రతిష్టాపన చేశారు. ఇందుకు హనుమంతునికి కాశీ క్షేత్రం నుండి శివలింగం తీసుకురావాల్సిందిగా హనుమంతునికి శ్రీరాముడు ఆదేశించగా… హనుమంతుడు కాశీ లింగాన్ని అనుకున్న సమయంలో తేవలేకపోతాడు. దీంతో శ్రీ సీతారాములు తుంగభద్ర నది తీరాన ఇసుకతో స్వయంగా ఇసుక లింగాన్ని తయారు చేసి వారు నిశ్చయించిన సమయానికి ప్రతిష్టించారని స్థలపురాణం చెబుతోంది. అందుకే ఈ క్షేత్రానికి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంగా పేరు స్థిరపడింది. ఆతరువాత కాశీ లింగంతో వచ్చిన శ్రీరామ భక్తులైన హనుమంతుడు నేను తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్టించాలని శ్రీరాములవారిని కోరినందుకు కాశీ లింగాన్ని కూడా ప్రతిష్టిస్తారు. ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాసంలో అరణ్యంలో జీవనాన్ని సాగిస్తూ వస్తున్న క్రమంలో వారు అరణ్యవాసం నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ శ్రీ గురజాల రామలింగేశ్వర స్వామి దేవాలయం లో పాండవులు ధర్మరాజు, అర్జునుడు, భీముడు ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్టించినట్టు ఆ విగ్రహాలనే ధర్మ, పార్థ, భీమ లింగాలుగా ఇప్పటికీ కొలుస్తున్నారు.
ఈ క్షేత్రానికి మహాశివరాత్రి, కార్తీక మాసంతో పాటు ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకమైన పర్వదినాల్లో శ్రీ గురుజాల రామలింగేశ్వర స్వామి దర్శనానికి లక్షలాదిమంది భక్తులు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రం నుండి భక్తులు వస్తుంటారు. శ్రీ గురజాల రామలింగేశ్వర స్వామి కొలిచిన వారికి కొంగు బంగారమని ఇక్కడికి వచ్చే భక్తులు విశ్వాసం.