అన్ని రకాల చెట్లు, మొక్కలు ఆకురాలి మోడుబారే వేసవికాలం ప్రారంభంలో విరగబూసిన మోదుగుపూల అందాలు చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. కాషాయ కాంతులతో విరగబూసిన పూలతో చెట్టు బెరడు కనిపించకుండా కనువిందు చేస్తున్నాయి. ఈ పూలు హోలీ పండుగకు రంగుల తయారీలోనూ విరివిగా ఉపయోగపడతాయి. గోగుపూలను వేడి నీటిలో మరగబెట్టి రంగును తయారుచేసి ఆ రంగులను హోలీ పండుగ రోజు చల్లుకొని సంబరాలను జరుపుకునేవారు. ఎలాంటి రసాయనాలు కలవని ఈ రంగు వాడకం ఎంతో శ్రేయస్కరం. దురదృష్టవశాత్తు కొందరి వ్యాపార లాభాల కోసం పెరుగుతున్న రసాయన రంగుల ఉపయోగం ప్రజల ఆరోగ్యం పాలిట హానికరంగా తయారయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
మోదుగు పూలు శివుడికి ప్రీతిపాత్రమైనది
మోదుగు పువ్వంటే పరమ శివుడికి ఎంతో ఇష్టమని పురాణాలు చెప్తున్నాయి. శివాలయాల్లో మోదుగు పూలను శివుడికి సమర్పిస్తారు. మోదుగు ఆకులే కాదు దాని కాడలు, కొమ్మలను కూడా పూజ కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. యాగాలు, యజ్ఞాలు, హోమాల్లో వీటి కొమ్మలను వినియోగిస్తారు.
మోదుగులో ఔషధ గుణాలు
మోదుగు జిగురు విరేచనాలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. విత్తనాలను పొడి చేసి తేనెలో కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులను నిర్మూలిస్తుంది. దీర్ఘకాలికంగా ఉన్న పుళ్లును తగ్గిస్తుంది. మోదుగు ఆకుల పొడితో మధుమేహం అదుపులో ఉంటుంది. మోదుగు ఆకుల కషాయాన్ని పుక్కిలిస్తే నోటి దుర్వాసన తగ్గుతుందని పెద్దలు చెపుతారు.
కల్తీ లేని రంగు
ప్రస్తుతం సమాజంలో కల్తీలేనిదంటూ ఏదీలేదు. పీల్చే గాలి కూడా కలుషితం అవుతోంది. ఆధునిక సమాజంలో హోలీ పండుగకు అత్యంత ప్రమాదకరమైన రంగులు వాడుతున్నారు. దీంతో కండ్లలో రంగుపడి చాలామంది చూపు కోల్పోయిన సంఘటనలున్నాయి. కల్తీ రంగులతో చూపు తగ్గడంతో పాటు చర్మవ్యాధులు కూడా వస్తాయి. అందుకే కల్తీ లేని మోదుగు (బసంతం) పూలను ఉపయోగించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మోదుగు పూలతో శరీరానికి ఎలాంటి నష్టం వాటిల్లదు. ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తడి రంగుల కోసం మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. శరీరంపై పడినా ఏమి ఇబ్బంది లేదు. అందుకే సహజత్వంగా ఉండే రంగులు చల్లి శరీరాన్ని రోగాల బారినుండి కాపాడుకోవాలని పెద్దలు చెబుతున్నారు.