Tuesday, November 5, 2024
HomeదైవంKurnool: నల్లమలలో కార్తీక శోభ

Kurnool: నల్లమలలో కార్తీక శోభ

హరహర మహాదేవ..

నల్లమల అడవులు ప్రకృతి అందాలకే కాదు… ప్రసిద్ధ శైవ క్షేత్రాలకూ నెలవు. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి క్షేత్రం , మహానంది శ్రీ కామేశ్వరీ మహానందీశ్వర క్షేత్రం, శ్రీ సప్తనదీ సంగమేశ్వర ఆలయం, ఓంకారం క్షేత్రం, కొలనుభారతి సరస్వతి అమ్మవారి ఆలయం, రుద్ర కోడూరు వంటి ఆలయాలు నల్లమల ఒడిలో ఒదిగి ఉన్నాయి. ఆదిదేవుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం కావడంతో ఈ క్షేత్రాలు శివనామస్మరణ తో మార్మోగుతున్నాయి. కార్తీక సోమవారాలు, సెలవు రోజుల్లో ఈ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తనున్నారు. నవంబరు 4న తొలి కార్తీక సోమవారం సందర్భంగా నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి.

- Advertisement -

శ్రీశైలం

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో భక్తులతో కిటకిటలాడుతోంది. మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మ వార్ల దర్శనార్థం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పాతాళగంగలో కార్తీక పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు పునీతులవుతున్నారు. అలాగే క్షేత్రపరిధిలో సాక్షిగణపతి, హఠకేశ్వరం, ఇష్టకామేశ్వరి తదితర ఆలయాలతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శివాజీ స్ఫూర్తి కేంద్రం వంటి సందర్శనీయ ప్రదేశాలను భక్తులు సందర్శిస్తున్నారు. క్షేత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతుంది.

మహానంది

నల్లమల ప్రకృతి అందాల నడుమ వెలసిన మహానంది ఆలయం అత్యంత ప్రాచీనమైనది. శ్రీ కామేశ్వరీసహిత మహానందీశ్వరుడి దర్శనార్థం కార్తీకమాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. నల్లమల అందాలు, ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రంలో నంది విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

సంగమేశ్వరం

కొత్తపల్లి మండలంలోని సప్తనదీ సంగమేశ్వర క్షేత్రం శ్రీశైల జలాశయంలో నీటినిల్వలు సమృద్ధిగా ఉండటం వల్ల నీటమునిగింది. దీంతో భక్తులు ఎగువన ఉన్న ఉమామహేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. క్షేత్రంలోని సప్తనదీ జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించవచ్చు. ఆత్మకూరు నుంచి 34 కిలోమీటర్లు కొత్తపల్లి మండల కేంద్రం మీదుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ క్షేత్రానికి ఆత్మకూరు నుంచి బస్సు సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. తెలంగాణా నుంచి బొట్ ల ద్వారా తెలంగాణ నుంచి భక్తులు తరలివస్తుంటారు.

ఓంకార క్షేత్రం

బండిఆత్మకూరు మండలంలో వెలసిన ఓంకార క్షేత్రం కార్తీక మాస శోభ సంతరించుకుంది. చాళుక్యుల కాలంలో క్షేత్ర నిర్మాణం జరిగినట్లు ఇక్కడి పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసోత్సవాన్ని పురస్కరించుకుని గంగాఉమాసమేత సిద్ధేశ్వరస్వామి దర్శనార్థం భక్తులు విశేషంగా తరలివస్తుంటారు. అలాగే ఎగువ న ఉన్న కొండపై కాశీవిశాలక్ష్మి అమ్మవారి ఆలయం, వేంకటేశ్వరుడి సన్నిధితో పాటు పలువురు దేవతామూర్తుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భక్తులకు కాశీరెడ్డినాయన ఆశ్రమం తరపున ఉచిత నిత్యాన్నదాన సత్రం నిర్విరామంగా కొనసాగుతోంది. బండిఆత్మకూరు నుంచి 12 కిలో మీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.

కొలనుభారతి

కొత్తపల్లి మండలంలోని కొలనుభారతి క్షేత్రం రాష్ట్రంలోనే ఏకైక సరస్వతి ఆలయంగా పేరుగాంచింది. ఆత్మకూరు నుంచి 16 కిలో మీటర్ల దూరంలో గల శివపురం చేరుకుని… అక్కడి నుంచి 5 కిలోమీటర్ల మేర అటవీ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. అలాగే క్షేత్రంలోని సప్తశివాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. ఈ క్షేత్రానికి ఆత్మకూరు ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

రుద్రకోటేశ్వరాలయం

ఆత్మకూరు మండలంలోని నల్లకాల్వ గ్రామం నుంచి 15 కిలో మీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అరణ్యంలో రుద్రకోటేశ్వరాలయం వెలసింది. పూర్వం ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంభూ లింగరూపంలో వెలసినట్లు పురాణ, ఇతిహాసాలు చెబుతున్నాయి. ఆలయానికి ఈశాన్యంలో ఓ కల్పవృక్షం ఉంది. ఈ వృక్షాన్ని తాకితే అమృతం స్రవించడమే కాకుండా..దీన్ని పూజిస్తే సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అటవీ శాఖ అధికారుల అనుమతుల మేరకు ట్రాక్టర్ల ద్వారా క్షేత్రానికి వెళ్లాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News