Lunar Eclipse 2025: ఆదివారం రాత్రి ఆకాశంలో అరుదైన దృశ్యాన్ని అందించిన సంపూర్ణ చంద్ర గ్రహణం విజయవంతంగా ముగిసింది. ఈ గ్రహణం రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల తర్వాత పూర్తిగా విడిచిపెట్టింది. గ్రహణం ముగిసిన తరువాత ఏమి చేయాలి అన్న విషయంలో పండితులు కొన్ని ఆచారాలను సూచిస్తున్నారు. ఈ పద్ధతులను పాటించడం వల్ల మనసు, ఇల్లు, ఆహారం శుద్ధిగా మారతాయని విశ్వసిస్తున్నారు.
ఇంటిని పూర్తిగా..
పండితుల సూచన ప్రకారం చంద్ర గ్రహణం తరువాత ఉదయం లేవగానే మొదట ఇంటిని పూర్తిగా శుభ్రం చేయాలని చెప్పారు. ఇంట్లోని వస్తువులపై పవిత్ర నది జలాలను చల్లడం ద్వారా ఆ పరిసరాలు శుద్ధి అవుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా గదులు, వంటగది, పూజా స్థలం ఇలా ప్రతీ మూలన కూడా నీటిని చల్లడం ఆచారంగా కొనసాగుతోంది.
వండిన లేదా మిగిలిన ఆహారం..
అదేవిధంగా, గ్రహణ సమయంలో వండిన లేదా మిగిలిన ఆహారం తినకూడదని, ఆ ఆహారాన్ని వదిలేయాలని సూచిస్తున్నారు. ఎందుకంటే గ్రహణ సమయంలో వాతావరణం, కిరణాలు ఆహారంపై ప్రభావం చూపుతాయని నమ్మకం ఉంది. కాబట్టి రాత్రి మిగిలిన ఆహారాన్ని ఉదయం పడేయాలని, తరువాత కొత్తగా వంట చేయాలని చెబుతున్నారు.
తలస్నానం..
తలస్నానం కూడా తప్పనిసరి అని పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే తలస్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుందని, గ్రహణం ప్రభావం పూర్తిగా తొలగిపోతుందని విశ్వాసం. కేవలం స్నానం కాకుండా శరీరమంతా పవిత్రంగా ఉంచడం ఆచారంగా పాటిస్తారు.
దానం చేయడం..
ఇంకో ముఖ్యమైన ఆచారం దానం చేయడం. గ్రహణం తరువాత పేదలకు ఆహారం, దుస్తులు, పాలు, బియ్యం, చక్కెర వంటివి ఇవ్వడం మేలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ దానం వల్ల దాతృత్వ భావన పెరుగుతుందని, మనసుకు ప్రశాంతత వస్తుందని విశ్వసిస్తారు. కాబట్టి చంద్ర గ్రహణం తరువాత ఉదయం శుద్ధి చర్యలతో పాటు దానం చేయడం కూడా ముఖ్యమైన భాగంగా పరిగణిస్తున్నారు.
మళ్లీ గ్రహణం ఎప్పుడు…
ఇక చంద్ర గ్రహణం ముగిసిన వెంటనే అందరిలో ఒకే సందేహం కలిగింది. మళ్లీ గ్రహణం ఎప్పుడు రానున్నది అని. ఈ విషయంపై ఖగోళ శాస్త్రజ్ఞులు, పండితులు వివరాలు వెల్లడించారు.
సూర్యగ్రహణం..
తాజా సమాచార ప్రకారం ఈ నెల 21వ తేదీన మరో గ్రహణం ఏర్పడనుంది. ఈసారి సూర్యగ్రహణం మనకు కనువిందు చేయనుంది. ఆ ఆదివారం రాత్రి 11 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఉదయం 3 గంటల 23 నిమిషాల వరకు ఇది కొనసాగుతుంది. అంటే మొత్తం నాలుగు గంటలకు పైగా ఈ సూర్యగ్రహణం ఉంటుంది.
Also Read: https://teluguprabha.net/devotional-news/vastu-rules-warn-against-black-kitchen-slabs/
అయితే ఈ సూర్యగ్రహణం ప్రభావం భారతదేశంలో అంతగా కనిపించదు. మన దేశ ప్రజలు దీన్ని స్పష్టంగా గమనించలేరు. కానీ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఈ సూర్యగ్రహణం పూర్తిగా కనబడుతుంది. ఆ దేశాల్లో నివసించే వారు దీన్ని ప్రత్యక్షంగా చూడగలుగుతారు.


