హిందూ సంప్రదాయాల్లో ప్రతి నెల కూడా పవిత్రమైందే. ప్రతి మాసానికి ఓ విశిష్టత ఉంది. చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యం ఉంటుంది. ఈ నెలలో పరమేశ్వరుడు లింగ రూపం ధరించాడని పౌరాణిక గాధ. అంతేకాకుండా, చదువుల తల్లి సరస్వతి జన్మించినంది కూడా వసంత పంచమి అయిన మాఘ మాసంలోనేని నమ్ముతారు. సూర్యభగవానుడు తన రథంపై సంచారానికి బయలుదేరుతాడని కూడా విశ్విసిస్తారు. మాఘ మాసం పుణ్యస్నానాలకు పెట్టింది పేరు. ఈ మాసంలో మకర లగ్నంలో సూర్యభగవానుడు ఉండే సమయంలో చేసే స్నానాలకు విశిష్టత ఉది. ఈ జలమంతా హరి పరిపూర్ణుడై ఉంటాడని, ఆ విధంగా విష్ణుమూర్తి దయకు పాత్రులవుతామని చెబుతారు. మాఘ శుక్ల త్రయోదశి నుంచీ మూడు రోజులు ‘ మాఘీ ‘ అంటారు.. కనీసము ఆ మూడురోజులయినా నదీ/ సముద్ర స్నానము చేయాలి. ఈ మాఘస్నాన పుణ్యం వల్లే మృకండుముని మనస్వినిల కొడుకు మార్కండేయుడు మృత్యువును జయిస్తాడని పురాణం చెబుతోంది. శరీరాన్ని చలికి అలవాటు చేయటం కోసమే ఈ నియమాన్ని పెట్టి ఉంటారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. అందుకే చలికి భయపడకుండా ఉదయాన్నే నదీ స్నానం చేయటం ఉత్తమం.
సూర్యుడి ఆరాధన వేద కాలం నుంచి ఉంది. ప్రపంచం యావత్తు ఆరాధించకపోయినా, ఆయన గమనాన్ని గమనిస్తూనే ఉంది. భౌతికంగా ఈ భూమి మీద ప్రాణం నిలచి ఉండటానికి కారణం సూర్యుడు. అన్ని శక్తులూ ఆయన నుంచే లభ్యమవుతున్నాయనీ, సమస్త శక్తులకు సూర్యకిరణాలే కారణమని ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. ప్రాతఃకాలంలో స్నానం చేస్తే సూర్యుడు సంతృప్తి చెందుతాడని అంటారు. అంటే ఆరోగ్యమనే కదా అర్థం. నిలవ ఉన్న చల్లని నీళ్లతోకంటె గోరు వెచ్చని నీళ్లతో తలారా ఈ నెలంతా సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఇలా ఎందుకు అనుకోవచ్చు. ఎవరినైనా మనం గౌరవించటమంటే ఏంటి? వాళ్లు మన ఇంటికి వచ్చేసరికి శుభ్రంగా స్నానం చేసి ఆహ్వానించాలి కదా.
ఆయనను ఎందుకు ఆరాధించాలి అనుకోవచ్చు. మనం సూర్యుడి నుంచే ఆరోగ్యాన్ని కోరుకోవాలి. పాండవులు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు పాండవులను వెంటనంటి వచ్చిన వారందరికీ అన్నం పెట్టడానికి సూర్యుడు అక్షయపాత్ర ఇచ్చాడని ఒక కథ. ఇక కీచకుడు ద్రౌపది వెంటపడినప్పుడు ఆమె ఒక్క చేతితో అతడిని తోసేసరికి పక్కకు పడిపోతాడు. అంత శక్తి ఆవిడకు సూర్యారాధన వల్ల వచ్చిందని మరో కథ. సూర్యమంత్రాన్ని అగస్త్య మహాముని రాముడికి ప్రసాదించిన మరుసటి రోజున రావణ వధ జరిగిందని ఇంకో కథనం ఉంది. ఆయన వల్ల ఆరోగ్యం, ఆహారం, బలం, శక్తి సమకూరతాయని భావించడం వలనే వేద కాలం నుంచి సూర్యారాధన జరుగుతోంది. ఆయన పుట్టిన రోజు ఈ మాఘమాసంలోనే వస్తుంది. ఆయనను ఆరాధించటానికి మొదటిమెట్టుగా, స్నానం చేసి, అరుణోపాసనం చేసి, సూర్యభగవానుడిని ఆహ్వానించటానికి సిద్ధంగా ఉండాలి.
మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి. ఆసమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్ఠాన దైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సూర్యశక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుందని అంటారు. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహ స్నానంతోనైనా ఆరు సంవత్సరాలఅఘమర్షణ స్నానఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణవచనం.
ఉషోదయానికి ముందే చేసే స్నానాలు ఆత్యంత పుణ్యప్రదమైనవి మరియు అరోగ్యవంతమైనవి. ఈస్నానాలకి అధిపతి సూర్య భగవానుడు. కార్తీక గాలుల్లో చంద్రుడు ఓషది కారకుడై ఆరోగ్యం ఎట్లు కలిగించునో అట్లే రవి కూడా ఈకాలమందు ఆయన కిరణాలతో ఆరోగ్యాన్నిస్తాడు. అందుకే స్నానానంతరం సూర్యునికి ఆర్గ్యం ఇస్తారు. ఇక ఈ స్నానాలు అఘమర్షణ స్నానఫలాన్ని ఇస్తాయి. పుష్కర స్నానం ఫలాన్ని ఇస్తాయి. శతగుణ ఫలాన్ని ఇస్తాయి. సూర్యోదయంలో నారాయణుని ధ్యానిస్తూ స్నానం చేస్తే దేవతలచేత పూజితుడుఅవుతాడు. ఇక, నక్షత్రాలు ఉండగా చేయడం ఉత్తమం. లేనప్పుడు చేయడం మధ్యమం. సూర్యోదయం తదుపరి చెస్తే అధమం. మాఘ శుద్ధ సప్తమి -రథ సప్తమి బ్రాహ్మీ ముహూర్తంలో నక్షత్రాలు రథం ఆకారాన్ని కలిగి యుండునని పురాణ వచనం. ఈ రోజున అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలాపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు. నమస్కారం ప్రియ:సూర్య: అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది.ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం.
సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే “శమంతకమణి” ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. రథసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా!
రవి విశాఖ నక్షత్రంలో జన్మించిన రోజు. ఆనాటి నుండి రవికి భూమి దగ్గరవడం మొదలు ఆపై వేసవికాలం మొదలు. ఈ మాఘమాసంలో ముల్లంగి దుంపలనుు తినకూడదని శాస్త్రం చెబుతుంది. కాగా ఈ నెల రోజుల పాటు నవ్వుల్లో చక్కెరను కలుపుకునే తింటే మంచి ఫలితం ఉంటుందట. అంతేకాదు నువ్వులను ఇతరులకు దానం చేస్తుంటారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల పుణ్యం దక్కుతుందని. కాగా గోధుమ రంగులో ఉండే నువ్వులను రాగిపాత్రలో వేసి దానమిస్తే అంతా మంచే జరుగుతుందట.
“మాఘశుద్ద పంచమి”ని శ్రీ పంచమి అంటారు.ఈ పంచమి నాడే “సరస్వతీదేవి” జన్మించిందట. ఈనాడు “రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు. ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి.
‘మాఘాది పంచకం’ అంటే మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం ఈ ఐదు మాసాలు శుభకార్యాలకు ప్రసిద్ధి. ఇల్లు కట్టుకోవటానికి మాఘమాసం అనుకూలం. ఆత్మ కారకుడు, ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యభగవానుడు ఉచ్చస్థితిలో ఉండే కాలం. మఖ నక్షత్రంలో, పూర్ణిమ తిథి నాడు చంద్రుడు ఉండే కాలం కనుక కూడా దీనికి మాఘ మాసం అనే పేరు వచ్చింది. మాఘస్నానానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది మాఘమాసం కోసం ఎదురుచూస్తుంటారు.దీనికి కారణం ఈ మాఘస్నానాల వెనుక ఉన్న ప్రత్యేకత, ప్రయోజనాలే. మాఘమాసం స్నానానికి ప్రసిద్ది. మాఘస్నానం ఇహపరదాయకం. సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయని కమలాకర భట్టు రచించిన నిర్ణయ సింధులో చెప్పారు.
పవిత్రమైన విశేషమైన మాఘస్నానాన్ని సద్వినియోగం చేసుకొని పుణ్యఫలాన్ని పొందటానికి అందరూ ముందుండాలి. ఈ స్నానం ఆధ్యాత్మికతకు పునాదులు వేస్తుంది. మాఘమాసంలో పుణ్యమైన మాఘస్నానమే కాకుండా ఇంకా ఎన్నో పుణ్యదినాలున్నాయి. ఏ మాసంలో వచ్చే విశేష దినాలను ఆచరిస్తే మానసిక శాంతి, ఆధ్యాత్మికత, పుణ్యఫలం లభిస్తాయని ఋషులు ఆదేశించారు. కలియుగంలో కనీసం ప్రజలు వారు శక్తివంచన లేకుండా కొన్ని ధార్మిక, ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే జీవితం ఆనందంగా గడపవచ్చు.
ఆకెళ్ళ రామకృష్ణ,
పాదగాయ క్షేత్రం,
పిఠాపురం.