Swapna Sastra -Rats: హిందూ సంప్రదాయాలలో ప్రతి దేవుడికి, దేవతకు ఒక ప్రత్యేక వాహనం ఉంటుందని మనం చిన్ననాటి నుంచే వింటూ వచ్చాం. శివుడి వాహనం నంది, దుర్గాదేవి వాహనం సింహం, గణపతి వాహనం ఎలుక. అందువల్ల ఎలుకకు హిందూ మతంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. గణేశుడి వాహనం కావడంతో పాటు, ఈ చిన్న జీవి సంపద, అదృష్టం, శ్రేయస్సుతో కూడా అనుబంధం కలిగి ఉందని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… చాలా మంది తమ కలలలో ఎలుకలను చూసిన అనుభవాన్ని చెబుతుంటారు. అప్పుడు మనసులో తక్షణమే వచ్చే ప్రశ్న ఒకటే – కలలో ఎలుక కనబడితే అది శుభమా లేక అశుభమా?
ఎలుకను కలలో..
స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కలకు ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. ఎలుక కనిపించే విధానం, దాని రంగు, పరిమాణం, ప్రవర్తన – ఇవన్నీ కలలో దాని అర్థాన్ని నిర్ణయిస్తాయి. అందుకే ఎలుకను కలలో చూడటం ఎప్పుడూ ఒకే అర్థం ఇవ్వదు. కొన్ని సందర్భాలలో ఇది శుభలక్షణమైతే, మరికొన్ని సందర్భాలలో సమస్యలు లేదా సవాళ్లకు సంకేతం కావచ్చు.
లక్ష్మీదేవి కటాక్షానికి..
ముందుగా సాధారణంగా ఎలుకను కలలో చూడటం గణేశుడి అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షానికి సూచనగా భావించబడుతుంది. ఇలాంటి కలలు చాలా సార్లు ఆర్థిక లాభాలు, అదృష్టం, కుటుంబ సంతోషానికి సూచిస్తాయి. కాబట్టి ఒక సాధారణ ఎలుకను మీ కలలో చూసినట్లయితే అది సాధారణంగా శుభప్రదమైనదే.
తెల్ల ఎలుక కనబడితే..
అయితే, కలలో ఎలుక ఏ రూపంలో కనబడుతుందో దాని ఆధారంగా అర్థం మారుతుంది. ఉదాహరణకు, తెల్ల ఎలుక కనబడితే అది మరింత శ్రేయస్సు, ఆర్థిక పురోగతిని సూచిస్తుంది. తెల్ల ఎలుక హిందూ సంప్రదాయంలో పవిత్రతకు ప్రతీక. కాబట్టి తెల్ల ఎలుక పరుగెత్తడం, లేదా మన ముందర సంచరించడం అంటే త్వరలోనే సంపద, అదృష్టం కలిసివస్తాయని స్వప్న శాస్త్రం చెబుతుంది.
నల్ల ఎలుక గురించి…
ఇక నల్ల ఎలుక గురించి మాట్లాడితే, అది మాత్రం సాధారణంగా ప్రతికూల సూచనగా పరిగణిస్తారు. నల్ల ఎలుకను కలలో చూడటం అంటే మోసం, ద్రోహం లేదా ఆరోగ్య సమస్యలపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికగా భావిస్తారు. ముఖ్యంగా నల్ల ఎలుక భయంతో పారిపోతున్నట్లు కనబడితే, ఆర్థిక సమస్యలు లేదా వ్యక్తిగత సంబంధాలలో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని చెబుతారు.
ఎవరో కుట్ర…
కలలో ఎలుకను పట్టుకోవడం కూడా ఒక ప్రత్యేక అర్థం కలిగి ఉంటుంది. ఇలాంటి కలలు మీరు ఎదుర్కొంటున్న భయాలను లేదా సమస్యలను అధిగమించే శక్తి మీలో ఉందని సూచిస్తాయి. మరోవైపు ఇది కొన్నిసార్లు ఎవరో కుట్ర చేయబోతున్నారని, లేదా మోసానికి గురయ్యే అవకాశముందని కూడా చెబుతుంది.
చిన్న పిల్ల ఎలుకను…
చిన్న పిల్ల ఎలుకను కలలో చూడటం మాత్రం మంచి సూచనగా పరిగణిస్తారు. పిల్ల ఎలుక అంటే కొత్త ఆరంభాలు, సంతోషం, కెరీర్‌లో పురోగతి, కుటుంబ ఆనందం వంటి అంశాలను సూచిస్తుంది. గణేశుడి ఆశీర్వాదం మీపై ఉందని కూడా ఈ కల సూచించగలదు.
అలాగే చనిపోయిన ఎలుక కనిపించడం కూడా ఆసక్తికరమైన సంకేతం. మొదటి చూపులో అది భయంకరంగా అనిపించవచ్చు. కానీ స్వప్న శాస్త్రం ప్రకారం చనిపోయిన ఎలుకను చూడటం అంటే ఒక సమస్య ముగియబోతుందని, మీరు ఎదుర్కొంటున్న కష్టాల నుండి బయటపడబోతున్నారని అర్థం. ఇది భవిష్యత్తులో విజయానికి, వ్యక్తిగత లేదా వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలకు సంకేతం కావచ్చు.
పెద్ద ఎలుకను కలలో చూడటం మాత్రం జాగ్రత్త సూచిస్తుంది. ఇది సాధారణంగా మోసం, వంచనలకు సంబంధించినదిగా భావిస్తారు. నమ్మకమైన స్నేహితుడు లేదా దగ్గరగా ఉన్న ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉందని ఇది హెచ్చరిస్తుంది.
ఇక ఒకేసారి చాలా ఎలుకలు కనబడితే అది జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, ఒత్తిడులు, ప్రతికూల భావోద్వేగాలకు సూచన. వ్యక్తిగత సంబంధాలలో ఇబ్బందులు, ఉద్యోగంలో సమస్యలు లేదా అంతర్గత ఆందోళనలు పెరుగుతున్నాయని ఇది సూచించగలదు.


