Raksha Bandhan 2025 Date and Time: సోదర సోదరీమణుల మధ్య బంధానికి ప్రతీక.. రక్షాబంధన్. సోదర సోదరీమణులు ఒకరికొకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ ఇది. ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు రాఖీ పండుగ లేదా రక్షాబంధన్ జరుపుకుంటారు. ఈ పౌర్ణమినే శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే ఈ ఫెస్టివల్ ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది? రాఖీ కట్డడానికి శుభ సమయం ఏంటి?, అసలు భద్రకాలం ఉందా? వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
రక్షాబంధన్ ఎప్పుడు?
రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ రోజున జరుపుకోవడం అనవాయితీ. అయితే ఈ ఏడాది తేదీ గురించి ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఎందుకంటే పూర్ణిమ తిథి రెండు రోజులపాటు ఉంటుంది. దాంతో ఈ పండుగను ఆగస్టు 8న జరుపుకోవాలా లేదా ఆగస్టు 9న చేసుకోవాలా అనే సందిగ్ధంలో ప్రజలు ఉన్నారు. క్యాలెండర్ ప్రకారం, పూర్ణిమ తిథి ఆగస్టు 8, శుక్రవారం మధ్యాహ్నం 01:45 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 9, శనివారం మధ్యాహ్నం 01:32 గంటలకు ముగుస్తుంది. అయితే రక్షాబంధన్ ఉదయం పూట జరుపుకునే పండుగ కాబట్టి చాలా మంది పండితులు ఆగష్టు 09 శనివారం నాడు జరుపుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: Benefits of Parijat Plant – పారిజాత మెుక్క ప్రయోజనాలు
భద్ర కాలం ఉందా ?
భద్ర కాలం ఆగష్టు 08 శుక్రవారం రాత్రి వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఆగస్టు 09, శనివారం నాడు ఎలాంటి భద్రకాలం ఉండదు. మీరు ఆ రోజు ఏ శుభ ముహూర్తంలోనైనా సోదరుడికి రాఖీ కట్టొచ్చు. ఉదయం 5:35 నుంచి మధ్యాహ్నం 1:24 లోపు రాఖీ కట్టడానికి మంచి సమయం. ఉదయం 6 గంటల 38 నిముషాల లోపు అమృత ఘడియలున్నాయి. అభిజిత్ ముహూర్తంలో రాఖీ కట్టడం కూడా శుభప్రదంగా భావిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:53 వరకు ఈ సమయం ఉంది.


