కడప జిల్లా అంటేనే ఆధ్మాత్మిక కేత్రాలకు ప్రసిద్ధి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కడప జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువ జాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు స్నానాలు చేసి ఆలయాల బాట పట్టారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆధ్మాత్మిక శోభ సంతరించుకుంది.
కడప జిల్లాలో ప్రముఖ పుణ్యకేత్రాలైన పొలతల, నిత్యపూజ కోన, సంగమేశ్వర ఆలయం, ముక్కొండ, పుష్పగిరి, అల్లాడుపల్లెలో వీరభద్ర స్వామి ఆలయం, గని మల్లేశ్వరుని కొండ, లంకమల మెుదలైన ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే కడప నగరంలోని మృత్యజయ స్వామి ఆలయంలో శివరాత్రి శోభ సంతరించుకుంది.
పొలతలలో మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం
కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గంగన్నపల్లెలో అంగరంగ వైభవంగా పొలతల మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం జరిగింది. ఈ కల్యాణోత్సవంలో కుటుంబసభ్యులతో కలిసి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు.

అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి ఆశీస్సులు అందించారు అర్చకులు. అంతకుముందు ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకి, పుత్తా నరసింహారెడ్డికి అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
మహా శివ రాత్రి పండుగను పురస్కరించుకొని పొలతల మల్లేశ్వర స్వామి ఆశీస్సుల కోసం అనంతపురం, కర్ణాటక, కడప జిల్లా వ్యాప్తంగా ఇంకా అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వారందరికి ఆ దేవుని దీవెనలు ఉండాలని క్షేమంగా ఇంటికి వెళ్లాలని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి తెలిపారు.