శ్రీశైలంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మూడవ రోజు శనివారం భ్రమరాంబిక అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రావణ వాహనంపై ఆది దంపతులకు గ్రామోత్సవం నిర్వహించారు.
ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం నవదుర్గ అలంకారాల్లో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తికి చంద్రఘంట అలంకారం చేశారు. నవదుర్గల్లో మూడవ రూపమైన ఈ దేవి దశ భుజాలతో ప్రశాంత వదనంతో సాత్విక స్వరూపిణిగా దర్శనమిచ్చింది.
దేవి శాంత స్వరూపిణి అయినప్పటికీ యుద్దోన్ముఖురాలై ఉండటం విశేషం. అమ్మవారి మస్తకంపై అర్థచంద్రుడు అలరాడుతున్న కారణంగా ఈ దేవిని చంద్రఘంటదేవిగా పిలుస్తారు. ఈ దేవిని పూజించడం వల్ల భక్తుల కష్టాలన్నీ తీరుతాయని నమ్మకం.
దేవి ఆరాధన వల్ల సౌమ్యం, వినమ్రత అలవడుతాయి. ఉత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు రావణ వాహనంపై ఆశీనులను చేయించారు. రాత్రి ఆలయ వీధుల్లో గ్రామోత్సవం కన్నులపండువగా జరిగింది. రావణ వాహనంపై గ్రామోత్సవంలో విహరించిన ఆది దంపతులను చూసి భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. గ్రామోత్సవం ముందు భాగంలో ఏర్పాటుచేసిన వివిధ కళారూపాలు అలరించాయి.