శ్రీరామనవమి(Sri Rama Navami) సందర్భంగా భద్రాచలం(Bhadrachalam) సీతారామచంద్రస్వామి వారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు మిథిలా మండపంలో రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది.
కళ్యాణ మహోత్సవంలో భాగంగా కళ్యాణమూర్తులను అలంకరించి ఊరేగింపుగా మిథిలా మండపానికి చేర్చారు. స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు.
కాగా భద్రాచలంలో ఈరోజు జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆయన ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఉదయం 10.40 గంటలకు హెలికాఫ్టర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం చేరుకుంటారు. ముందుగా ఆలయంలో భద్రాద్రి రామయ్యను దర్శించుకుంటారు. అనంతరం మిథిలా మండపంలో జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు.
అనంతరం మధ్యాహ్నం 12.35 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూర్గంపాడు మండలం సారపాకలో ఓ రేషన్ కార్డుదారుడి నివాసానికి వెళ్లి అక్కడ భోజనం చేసి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అవుతారు.