Bhai Dooj 2025 Date and Muhurat: దీపావళి పండుగను ఉత్తర భారతదేశంలో ఐదు రోజులపాటు జరుపుకుంటారు. ధంతేరాస్ తో మెుదలయ్యే ఈ దీపాల పండుగ భాయ్ దూజ్ తో ముగుస్తుంది. సోదర సోదరీమణుల మధ్య పవిత్ర బంధానికి ప్రతీక బాయ్ దూజ్. దీనినే తెలుగులో భగినీ హస్త భోజనం అని పిలుస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీక మాసంలో శుక్ల పక్ష ద్వితీయ తిథి నాడు భాయ్ దూజ్ జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల నుదుటిపై తిలకం దిద్ది వారి దీర్ఘాయుష్షు మరియు శ్రేయస్సు కోసం యుముడిని ప్రార్థిస్తారు. అనంతరం సోదరుడు తన సోదరికి బహుమతులు ఇస్తాడు. ఈ పండుగకు పుష్ప ద్వితీయ, యమ ద్వితీయ, కాంతి ద్వితీయ వంటి పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఏడాది భాయ్ దూజ్ ఎప్పుడు వచ్చింది, తిలకధారణ ఏ సమయంలో చేయాలి, ఈ పండుగ వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం.
భాయ్ దూజ్ 2025 తేదీ మరియు ముహూర్తం
పంచాంగం ప్రకారం, కార్తీక మాసంలో శుక్ల పక్ష ద్వితీయ తిథి 22 అక్టోబర్ 2025, రాత్రి 8:16 గంటలకు ప్రారంభమై.. తర్వాత రోజు రాత్రి 10:46 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, భాయ్ దూజ్ పండుగను అక్టోబరు 23న జరుపుకోనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 1:13 గంటల నుండి 3:28 గంటల వరకు తిలక ధారణకు మంచి సమయం. అంటే వ్యవధి 2 గంటల 15 నిమిషాలు పాటు ఉండనుంది. ఈరోజున యముడు, మరియు చిత్రగుప్తుడిని పూజిస్తారు. అంతేకాకుండా ఈ రోజున యమునా నదిలో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.
Also Read: Solar Eclipse 2025 -సెప్టెంబరు 21న సూర్యగ్రహణం.. ఈ 4 రాశులకు దశ తిరగబోతుంది..
పురాణ గాధ
లోకానికి వెలుగునిచ్చే సూర్యభగవానుడు యమధర్మరాజు అనే కుమారుడు, యమున అనే కూతురు ఉన్నారు. చెల్లెలికి అన్న అంటే విపరీతమైన ప్రేమ. యుమనా దేవి వివాహం అయ్యాక తన సోదరుడిని ఎన్నోసార్లు తన ఇంటికి పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్లలేకపోయాడు. అయితే ఒకసారి కార్తీక మాస విదియ రోజున యముడు యమున ఇంటికి వెళ్లాడు. దాంతో యమునా దేవి ఎంతో సంతోషించి పిండివంటలతో భోజనం పెట్టి యముడిని ప్రసన్నం చేసుకుంది. దీంతో యమధర్మరాజు ఏదైనా వరం కోరమని సోదరిని అడుగుతాడు. ఆమె ఈ కార్తీకశుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే, తన సోదరి ఇంటికి వెళ్ళ భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని కోరుతుంది. ఈ కోరికకి సంతోషించిన యముడు బాయ్ దూజ్ జరుపుకున్న వారికి అకాల మరణం లేకపోవడంతోపాటు ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని వరలిచ్చాడట.
సోదరులు లేని వారు ఇలా చేస్తారు..
ఈ పండుగను మనదేశంతోపాటు నేపాల్ కూడా జరుపుకుంటారు. ఈ రోజున సోదరులను ఇంటికి ఆహ్వానించి వారి నుదుట బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, మిఠాయిలు తినిపించి అక్కాచెల్లెళ్లు వారికి శుభాకాంక్షలు చెబుతారు. అంతేకాకుండా వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు. హర్యానా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో సోదరులు లేని వారు చంద్రునికి హారతి ఇచ్చి ఈ వేడుకను జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ ను మహారాష్ట్రలో భయ్యా దుజ్ అని, నేపాల్ భాయి టికా అని, పంజాబ్ లో టికా అని పిలుస్తారు.
Also Read: Astrology -బుధుడు, శని గ్రహాల కలయిక.. ఇవాల్టి నుండి ఈ 3 రాశుల వారికి తిరుగులేదు ఇక..


