Mahalaya Amavasya 2025 Date and Time: హిందూ మతంలో అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంది. పితృ పక్షంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అని పిలుస్తారు. దీనికే సర్వపితృ అమావాస్య లేదా పిత్ర మోక్ష అమావాస్య అనే పేరు కూడా ఉంది. ఈరోజు పూర్వీకులకు శ్రాద్ధకర్మలు నిర్వహించడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఈ సంవత్సరం మహాలయ అమావాస్య ఎప్పుడు వచ్చింది, పూజా సమయం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
మహాలయ అమావాస్య తేదీ మరియు సమయం
పితృ పక్షంలో అమావాస్య తిథి సెప్టెంబర్ 21, 2025 అర్ధరాత్రి 12:16 ప్రారంభమై.. సెప్టెంబర్ 22, 2025న తెల్లవారుజామున 01:23న ముగిస్తుంది. దీని ఆధారంగా మహాలయ అమావాస్యను సెప్టెంబరు 21న జరుపుకోనున్నారు.
మహాలయ అమావాస్య ప్రాముఖ్యత
అమావాస్య హిందువులకు మతపరంగా మరియు ఆధ్యాత్మికపరంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూర్వీకులకు శ్రాద్ధకర్మలను నిర్వహించడానికి మహాలయ అమావాస్య చాలా మంచి రోజుగా భావిస్తారు. ఈరోజున వారి పేరు మీద తర్పణాలు వదలడం, పిండ ప్రదానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. అంతేకాకుండా వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. చివరగా బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వడంతోపాటు ఆహారం లేదా దుస్తులు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. పితృదోషంతో బాధపడుతున్నవారు ఈరోజున పూజలు నిర్వహించడం వల్ల దాని నుండి విముక్తి పొందుతారు. ఈ అమావాస్య తర్వాత నుంచే తొమ్మిది రోజుల నవరాత్రి ప్రారంభమవుతుంది.
Also Read: Karwa Chauth 2025-కర్వా చౌత్.. అక్టోబరు 09నా లేదా 10నా? ఖచ్చితమైన తేదీని తెలుసుకోండి..
మహాలయ అమావాస్య పూజా విధానం
ఈ అమావాస్య రోజున ఉదయాన్నే లేచి పవిత్ర స్నానమాచరించాలి. శుభ్రమైన బట్టలు ధరించి ఇంటిని శుభ్రం చేయాలి. అనంతరం సూర్యుడికి నీటితో అర్ఘ్యమివ్వాలి. బ్రాహ్మణులను మీ ఇంటికి ఆహ్వానించి మీ పూర్వీకుల పేరు మీద పితృతర్పణం చేయాలి. కుటుంబ పెద్ద శ్రాద్ధకర్మలు నిర్వహిస్తాడు. సాత్విక ఆహారాన్ని తయారు చేయాలి. పూజా ఆచారాలన్నీ పూర్తి చేసిన తర్వాత బ్రాహ్మణులకు ఆహారం, దుస్తులు మరియు దక్షిణను ఇవ్వండి. ఈ పవిత్రమైన రోజున ఆవులు, కుక్కలు, చీమలు మరియు కాకులకు ఆహారం ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. బ్రాహ్మణ భోజం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులు తినాలి.


